మై హోం.. యశోద.. తర్వాత అక్కడేనా? కేసీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నారా?
posted on Dec 23, 2020 @ 3:09PM
తెలంగాణ ముఖ్యమంత్రి చుట్టూ కేంద్రం ఉచ్చు బిగిస్తోందా? గులాబీ బాస్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టబోతున్నారా?. అంటే అవుననే తెలుస్తోంది. తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆ దిశగానే కనిపిస్తున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పొర్లు దండాలు పెట్టినా కేసీఆర్ తప్పించుకోలేరన్నారు చెబుతున్నారు. కేసీఆర్ అవినీతి బాగోతమంతా బయటపెడతామని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ నేతల కామెంట్లు అలా ఉండగానే హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ పై ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. యశోద హాస్పిటల్స్ యాజమాన్యంతో సీఎం కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు కొన్ని రోజులుగా చేస్తున్న ప్రకటనలకు.. తాజాగా జరిగిన ఐటీ దాడులకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో
రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంగళవారం రోజంతా యశోద ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. యశోద ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ ఐటీ శాఖ సోదాలు జరిపింది. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 20కి పైగా బృందాలతో ఈ సోదాలు జరిగాయి. ఆదాయ పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవల కరోనా చికిత్స పేరుతో రోగుల నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూల్ చేశారని హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే కొన్నింటిపై చర్యలు తీసుకున్న కేసీఆర్ సర్కార్.. ఎక్కువ ఆరోపణలు వచ్చిన యశోద హాస్పిటల్స్ పై మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేసీఆర్ కు సంబంధించిన వ్యక్తులు కాబట్టే చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ వైఖరిని హైకోర్టు కూడా తప్పుపట్టింది. ఇంతగా తెలంగాణ సర్కార్ అండదండలున్న హాస్పిటల్స్ పై జరిగిన ఐటీ దాడులకు... రాజకీయ లింకు ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయమే నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.
గత సంవత్సరం తెలంగాణలో దిగ్గజ నిర్మాణ రంగ సంస్థ ‘మై హోం కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్’ యజమాని జూపల్లి రామేశ్వరరావు ఇల్లు, కార్యాలయంలో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. నందగిరి హిల్స్‌లోని రామేశ్వరరావు ఇల్లు, బేగంపేట, హైటెక్ సిటీలోని కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మై హోంలో కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. మై హోం రామేశ్వరరావు కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడే. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చాలా కార్యక్రమాల్లో మై హోం కీలకంగా ఉందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు సన్నిహితులుగా ఉండే వ్యాపార ప్రముఖులే టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతుండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం పనులు దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థలపైనా త్వరలో దాడులు జరగవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ సహా ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మెగా సంస్థతో కలిసే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఇటీవల ఎక్కువ ఫోకస్ చేసింది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని చెబుతోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ చుట్టు ఢిల్లీ పెద్ద ఉచ్చు బిగిస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు. కేసీఆర్ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన సన్నిహితులను టార్గెట్ చేస్తూ ఉండవచ్చంటున్నారు.
మెఘాతో పాటు యశోద, మై హోంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు భారీగా పెట్టుబడులు ఉన్నాయని కొందరు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తెలంగాణలో చేపట్టిన మెగా ముఖ్యమైన ప్రాజెక్టులన్ని వాటాల కోసం వారికే కట్టబెడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్స్ పై దాడులు జరగడం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేసీఆర్ అవినీతి చిట్టాలు, ఆర్థిక మూలాల తీగ లాగేందుకే కేంద్ర ప్రయత్నిస్తుందా లేక రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఐటీ దాడులు జరిగాయా అన్నదానిపై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.