ఢిల్లీ బీబీసీ కార్యాలయంపై ఐటీ సోదాలు
posted on Feb 14, 2023 @ 1:30PM
ఢిల్లీ బీబీసీ కార్యాలయంపై ఐటీ సోదాలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో గుజరాత్ అల్లర్ల విషయంలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ జరుగుతున్న నేపథ్యంలో బీబీసీ కార్యాలయంలో ఐటీ రెయిడ్స్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఇన్‌కమ్ టాక్స్ అధికారులు మంగళవారం ఉదయం నుంచి ససోదాలు నిర్వహిస్తున్నారు. బీబీసీ సిబ్బంది ఫోన్లను ఐటీ అధికారులు సీజ్ చేశారని చెబుతున్నారు. కాగా గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ ఉదాశీనంగా వ్యవహరించినట్లుగా బీబీసీ డాక్యుమెంటరీ ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే.
ఈ డాక్యుమెంటరీ కేంద్రం నిషేధించడాన్నివిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈ డాక్యుమెంటరీని నిషేధించడం ద్వారా కేంద్రం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని మోడీ సర్కార్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీబీసీ డాక్యుమెంటరీ రూపకల్పన వెనుక చైనా హస్తం ఉందన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి.
చైనాకు చెందిన ప్రముఖ సంస్థ నుంచి బీబీసీకి పెద్ద ఎత్తున నిధులు సమకూరాయని బీజేపీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో సోదాలు రాజకీయంగా పెను దుమారం సృష్టిస్తున్నాయి. అయితే బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం బ్యాన్ విధించగా ఏకంగా ఆ ఛానెల్ ప్రసారాలను దేశంలో నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.