అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. కారణమదేనా?
posted on Aug 23, 2022 @ 10:09PM
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అయిన అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ ల భేటీ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించింది. వారి మధ్య భేటీ జరిగి రెండు రోజులు గడిచిపోయినా ఆ విషయంపై చర్చోప చర్చలు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. ఎప్పుడో 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ ఆగ్రనేత ఆయనను స్వయంగా ఢిన్నర్ మీట్ కు ఆహ్వానించడం.. ఆ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆయనను కలవడం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. ఈ భేటీపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించారనీ, తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారనీ.. ఇలా పలు రకాల చర్చలు తెరమీదకు వచ్చాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారైతే ఇరువురి మధ్యా రాజకీయ చర్చలే జరిగి ఉంటాయని చెప్పారు. బీజేపీ, వైసీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ తో భేటీపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ ఓ అద్భుత నటుడితో భేటీ ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. ఇక బీజేపీ సీనియర్లు అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో ఆయనతో భేటీ కావాలని భావించారని, అందుకే ఆయన ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ భేటీ అయ్యారనీ చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా తెలుగు ఇండస్ట్రీలో మరో టాక్ జోరుగా వినిపిస్తున్నది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. అందుకు సినిమాను కూడా బలమైన ఆయుధంగా వాడుకోవాలని భావిస్తోంది. అందుకే తెలంగాణ సాయుధ పోరాట యోధుల అణచివేతకు నిజాం నవాబు రజాకార్లను పంపిన సంఘటనలపై రజాకార్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించాలన్న యోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఆ సినిమాకు ఇప్పటికే కథ సిద్ధమైందని కూడా అంటున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి, ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఆ కథను ప్రధాని మోడీకి వినిపించినట్లు కూడా చెబుతున్నారు. రజాకార్ ఫైల్స్ కథ వినడం కోసం ఐదు నిముషాల పాటు విజయేంద్ర ప్రసాద్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ దానికి ఇరవై నిముషాలకు పెంచినట్లు కూడా చెబుతున్నారు. ఆ కథకు కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ అయితేనే సరిపోతారని విజయేంద్ర ప్రసాద్ భావించారనీ అదే విషయాన్ని మోడీతో చెబితే మోడీ అమిత్ షాతో ఒక సారి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాల్సిందిగా చెప్పారనీ, ఆ పర్యవశానమే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ అని చెబుతున్నారు. రజాకార్ ఫైల్స్ సినిమా తెలంగాణలో బీజేపీ పలుకుబడి పెంచుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రకు సర్వత్రా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజాకార్ ఫైల్స్ సినిమాలో నటిస్తే కాశ్మీర్ ఫైల్స్ ను మించి ప్రజలను ఆకట్టుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ ను సినిమాతో ఆపేయకుండా వెబ్ సిరీస్ కూడా తీయాలన్న భావనతో ఉన్నారనీ, రెంటిలోనూ జూనియర్ ఎన్టీఆరే ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ వార్త ధృవపడాల్సి ఉంది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయ, సినీ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్నేళ్లుగా సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియని తారక్.. మళ్లీ రాజకీయాల వైపు వస్తున్నారా..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో యంగ్ టైగర్ భేటీ వెనక ఆంతర్యమేంటి..? ట్రిపుల్ ఆర్ కోసమే అయితే.. రామ్ చరణ్ లేకుండా స్పెషల్ మీటింగ్ ఎందుకు..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడం ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ వర్గాల్లో కంటే.. రాజకీయంగా ఈ భేటీ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. బీజేపీ అగ్ర నేతతో తారక్‌కు పనేంటి..? అంత ప్రత్యేకంగా ఈ ఇద్దరూ కలవడానికి కారణమేంటంటూ ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ట్రిపుల్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్ర నచ్చి.. అమిత్ షా ప్రశంసించారని తారక్ వర్గాలు చెప్తున్న మాట. అయితే ఈ భేటీ వెనుక పాలిటిక్స్ తప్ప మరొకటి లేదన్నది మరికొందరి అభిప్రాయం. భేటీ తర్వాత ఎలాంటి లీకులు రాకపోవడంతో నిజంగా వారిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్న ఆసక్తి నెలకొంటోంది.
తారక్, అమిత్ షా భేటీ వెనక మరో వార్త టాలీవుడ్ వర్గాల్లో బాగా వైరల్ అవుతుంది. ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే.. రజాకార్ ఫైల్స్ అనే సినిమా ఒకటి త్వరలోనే రాబోతుంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. బిజేపీ ప్రభుత్వ సపోర్ట్‌తోనే రజాకార్ ఫైల్స్ భారీ ఎత్తున తెరకెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో తారక్‌ను నటింపచేయాలనేది పార్టీ ఎత్తుగడలా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. తారక్, అమిత్ షా మధ్య రాజకీయ చర్చకు తావేం లేదని.. కేవలం ఈ రజకార్ ఫైల్స్ సినిమా గురించి చర్చించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అటు రాజకీయం, ఇటు సినిమాలపై పూర్తి అవగాహన ఉన్న తారక్.. తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తును అంచనా వేసుకునే నిర్ణయం తీసుకుంటారనే అతన్ని దగ్గర్నుంచి గమనించిన వాళ్ళకు అర్థమవుతుంది. మరి రజాకార్ ఫైల్స్ విషయంలో అమిత్ షా తారక మంత్రం ఎంతవరకు పని చేస్తుందనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న.