సాగర్ బరిలో కోమటిరెడ్డి.. పువ్వు గుర్తుపై పోటీ!
posted on Mar 17, 2021 @ 5:42PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అంగ బలం, అర్థ బలం దండిగా ఉన్న నేత. నల్గొండలో మంచి పట్టున్న నాయకుడు. ఆయనకు ఎప్పటి నుంచో బీజేపీ గాలం వేస్తోంది. కోమటిరెడ్డి సైతం కాషాయ కండువా కప్పుకునేందకు ఆరాటపడుతున్నారు. అందుకు సరైన సమయం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. నీ అవసరం వచ్చేసిందని.. సమయం లేదు మిత్రమా అంటూ.. కమలనాథులు కోమటిరెడ్డిని పార్టీలోకి రా..రామ్మని పిలుస్తున్నారట. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేయమని అడుగుతున్నారట. ఈ మాట ఎవరో అంటున్నది కాదు. సాక్షాత్తూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే ఈ విషయం స్పష్టం చేశారు.
తాను నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని, కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు ఆయన సైతం సై అన్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను బీజేపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డి మూడో స్థానానికి పరిమితమవుతారని జోస్యం చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి పోటీ చేస్తే నాగార్జున సాగర్ ఉప పోరు మరింత రంజుగా సాగడం ఖాయం. ముక్కోణపు పోరు పక్కా. కాంగ్రెస్ తరఫున జానారెడ్డి బరిలో నిలవడం.. టీఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతుండటం.. ఈ సమయంలో కోమటిరెడ్డిపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడంతో నల్గొండ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మరి, సాగర మధనంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో....