నాయిని నిర్లక్ష్యానికి గురయ్యారా! అనుచరులు ఏమంటున్నారు?
posted on Oct 22, 2020 @ 12:34PM
కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ కెరటం, తెలంగాణ తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి మరణం విషాదం నింపింది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాయిని మృతిపై పార్టీలకతీతంగా నేతలు సంతాపం చెబుతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసురుకుంటున్నారు. కార్మిక నేతగా కార్మికుల సంక్షేమం కోసం నాయిని చేసిన కృషి, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తు చేసుకుంటూ కన్నీరు కార్చుతున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయిని నర్సింహరెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆరోపణలు ఆయన అనుచరుల నుంచి వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడిన నాయినికి పార్టీలోనే అవమానాలు జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ రెండో టర్మ్ ముఖ్యమంత్రి అయ్యాకా నాయిని నర్సింహరెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మొదటి టర్మ్ లో హోంశాఖ మంత్రిగా పనిచేసిన నాయినిని కేబినెట్ నుంచి తప్పించడం తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ కోసం ఎంతో చేసిన నాయినిని కేబినెట్ లోకి తీసుకోకుండా కేసీఆర్ అవమానించారనే ఆరోపణలు అప్పడు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. ఆ తర్వాత నుంచి నాయిని పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని చెబుతున్నారు. పార్టీలో వరుసగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు నాయిని ఆసక్తి చూపినా ఏజ్ వంకతో ఇవ్వలేదు. తనకు కాకుంటే అల్లుడికైనా ఇవ్వాలని నాయిని కోరినా కేసీఆర్ పట్టించుకోలేదనే చర్చ టీఆర్ఎస్ లో ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో నాయినికి టికెట్ ఇవ్వని కేసీఆర్.. ఆయన్ను రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని మండలికి పంపిస్తానని కూడా టీఆర్ఎస్ అధినేత చెప్పినట్లు చెప్పుకున్నారు. కాని రెండేండ్లు కావస్తున్నా నాయినిని రాజ్యసభకు పంపలేదు గులాబీ బాస్. గతంలో మూడు రాజ్యసీట్లను భర్తీ చేసినా నాయినికి ఛాన్స్ ఇవ్వలేదు. కేసీఆర్ తీరుతో చాలా రోజులుగా నాయిని అసంతృప్తిగా ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదని చెబుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంతో పాటు గ్రేటర్ పరిధిలోని తన అనుచరులతో మాత్రమే ఆయన టచ్ లో ఉన్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. గత జూన్ లోనే నాయిని ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తైంది. అయితే రెన్యూవల్ మాత్రం ఇవ్వలేదు. నాయినికి మరోసారి మండలి అవకాశం కూడా ఉండకపోవచ్చనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జరిగింది. నాయిని అల్లుడికి కూడా కష్టమేనని కారు పార్టీ నేతలే చెప్పారు.
తనను కేబినెట్ నుంచి తప్పించినప్పటి నుంచి పార్టీలో అసంతృప్తిగానే ఉంటున్న నాయిని ఇటీవల పరిణామాలతో మరింత నొచ్చుకున్నారని చెబుతున్నారు. తనను రాజ్యసభకు పంపక పోవడం, అల్లుడికి ఇస్తానన్న ఎమ్మెల్సీ హామీ నెరవేరకపోవడం, తమ పదవులపై కేసీఆర్ ఎటూ తేల్చకపోవడం, ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై మీడియాలో వస్తున్న వార్తలతో నాయిని నర్సింహరెడ్డి అసహనానికి గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఇటీవల మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ చేసినన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఉద్యమంలో ముందున్న నేతలకు అన్యాయం జరుగుతుందని స్వామిగౌడ్ ఆరోపించారు. చాలా కాలంగా నాయిని కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని సార్లు తన అసంతృప్తిని ఓపెన్ గానే బయటపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే ఆయన తీవ్ర నిర్ణయం తీసుకోవచ్చని, టీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో ముందున్న నాయిని నర్సింహరెడ్డికి రాష్ట్రం ఏర్పడ్డాకా దక్కాల్సిన గౌరవం దక్కలేదనే ఆరోపణలే అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ కొన్ని ఒడిదిడుకులు ఎదుర్కొంది. పార్టీని నడపలేని పరిస్థితికి కూడా కేసీఆర్ వచ్చారంటారు. అలాంటి సమయంలో నాయిని కేసీఆర్ కు అండగా నిలిచారని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టారని నాయిని అనుచరులు చెబుతున్నారు. వైఎస్సార్ టైమ్ లోనే కొందరు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరారు. కాని నాయిని మాత్రం కేసీఆర్ తోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వైఎస్సార్ నుంచి ఒత్తిడి వచ్చినా, భారీ ఆఫర్లు ఇచ్చినా నాయిని వెళ్లలేదని, కేసీఆర్ తోనే ఉన్నారని చెబుతున్నారు. పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న నాయినిని కేసీఆర్ నిర్లక్ష్యం చేయడం సరికాదనే విమర్శలు టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా వస్తున్నాయి. మొత్తంగా ఉద్యమంలో కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న నాయినికి ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఆయన అనుచరులు తట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది.