విశాఖ ఉక్కుని జగన్ రెడ్డి కొంటున్నారా?
posted on Mar 9, 2021 @ 1:35PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కాక రేపుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఆంధ్రులు భగ్గుమంటున్నారు. ఉక్కు కర్మాగారం దగ్గర సోమవారం సాయంత్రం నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ అధికారులకు నిరసన తెగ తగిలింది. ఎక్కడికక్కడ అధికారుల కార్లను కార్మికులు అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గూడు పుఠాని బయటపడడంతో మోడీ, జగన్ బొమ్మలను కార్మికులు తగులబెట్టారు. జగన్, మోడీ ప్రభుత్వాలకు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నామంటూ కేంద్రం చేసిన ప్రకటనపై సీరియస్ గా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తోందని.. ఏపీ సీఎం జగన్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. గంగిరెద్దుల్లా తలాడించడానికి 28 మంది ఎంపీలున్నారని.. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగమేంటని ట్విటర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు.
'"విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంది. జగన్ రెడ్డి కొంటున్నాడు.. ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగం ఏంటి? విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో జగన్ రెడ్డి పిరికి కాలక్షేపం,వైకాపా నాయకుల డ్రామాలు ఆపాలి’’ అని నారా లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.