Read more!

స్వీయ సంరక్షణార్థమే హస్తిన యానమా?

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ను కాపాడగలనన్న నమ్మకాన్ని జగన్  కోల్పోయారా? ఇక అవినాష్ సంగతి వదిలేసి.. హత్య ఆరోపణలు తన ఇంటి మీదకు రాకుండా ఉండేందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అవినాష్ కోసం ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

గుండె పోటు నుంచి మొదలు పెట్టి గొడ్డలి పోటు వరకూ వచ్చి... నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా ఒక కన్ను రెండో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అంటూ సెంటిమెంట్ కూడా పండించారు. ఇప్పుడు చివరికి బాబాయ్ ని హత్య చేసింది ఆయన కుమార్తె, అల్లుడే అంటూ కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. అదే వాదనను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట, కోర్టులోనూ వినిపించారు. అయితే అవేమీ ఫలించలేదు. వివేకా హత్య కేసులో ఇక అవినాష్ అరెస్టే తరువాయి. ఏ క్షణంలోనైనా ఆయనా, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిల అరెస్టు తథ్యం అని గట్టిగా వినిపిస్తున్న వేళ.. జగన్ హుటా హుటిన సిరికిం జెప్పడు అన్నట్లుగా హస్తిన ఫ్లైట్ ఎక్కేశారు. హడావుడిగా ప్రధాని అప్పాయింట్ మెంట్ సైతం సంపాదించేశారు.

బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ.. ఆ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ ఆయన ఒక రోజు ఢిల్లీ పర్యటన ఎందుకన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అయితే ఆ ప్రశ్నకు తెలుగుదేశం నాయకుల నుంచి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికే నని సమాధానం వస్తుంటే.. పరిశీలకులు మాత్రం స్వీయ సంరక్షణార్థం అంటున్నారు.  మొత్తం మీద వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారుల పాత్ర బయటకు వచ్చే సమయానికి దర్యాప్తు పురోగతిని అడ్డుకోవడానికి వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. సీబీఐ తనను విచారించకుండా ఆదేశాలివ్వాలి, అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వడం అంటూ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. నాలుగో సారి విచారణలో అవినాష్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు తెలుస్తోంది. అన్నిటికీ మించి వివేకా హత్య జరిగిన వెంటనే సాక్ష్యాధారాలను నాశనం చేయడం దగ్గర నుంచి, ఆయన చేసిన ఫోన్ల వరకూ ప్రతి విషయంలోనూ ఆయనను సీబీఐ తన ప్రశ్నల ద్వారా కార్నర్ చేసిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే  కేసు తుది తీర్పువెలువరించే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే  సీబీఐ అవినాష్ ను విచారించి పంపించేస్తుంది. కోర్టు ఆదేశాల కారణంగా అరెస్టు చేసే అవకాశం లేదు. అయితే విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే అవినాష్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. సీబీఐ విచారణలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అన్ని దార్లూ మూసుకుపోయాయి. దీంతో అవినాష్ తరువాత సీబీఐ ఎవరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుంది? ఈ కేసులో ఇంకా ఎవరెవరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది? అన్న చర్చ సర్వత్రా సాగుతోంది.

హత్య జరిగిన వెంటనే అవినాష్ ఎవరికి ఫోన్లు చేశారు. అవతల ఫోన్ లో మాట్లాడిన వారెవరు ఇత్యాది అంశాలపై సీబీఐ దృష్టి సారించి అందుకు అనుగుణంగా దర్యాప్తును ముందుకు తీసుకు వెళుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఆ రకంగా చూస్తే ఈ కేసు ముఖ్యమంత్రి నివాసం తాడెపల్లి ప్యాలెస్ దిశగా సాగే అవకాశాలే ఉన్నాయని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక తన ‘సోదరుడి’ కోసం కాకుండా తన గురించే ఆలోచించాల్సిన అనివార్య పరిస్థితిని జగన్ వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హఠాత్ హస్తిన యానం అని విశ్లేషిస్తున్నారు.  ఏది ఏమైనా వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ తాను చిక్కుల్లో పడకుండా ఉండేందుకే ఇక ప్రాధన్యత ఇస్తారనీ, అవినాష్ అరెస్టు ఖాయమనీ, ఆయన కోసం ఇక ఎలాంటి ప్రయత్నాలూ చేసే అవకాశాలు లేవనీ విశ్లేషకులు అంటున్నారు.