చెమట వాసనకు డియోడరెంట్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!
posted on May 10, 2023 @ 9:30AM
మగవారు ప్రతి రోజూ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు డియోడరెంట్ వాడటం తప్పనిసరి. ఆడవారి కంటే మగవారిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇది మగవారికి ఎంతో అవసరం కూడా. అయితే ప్రస్తుతం సబ్బుల నుండి షాంపూలు, లోషన్‌ల వరకు. పెర్ఫ్యూమ్‌ల నుండి డియోడరెంట్స్ వరకు ప్తతి ఒక్కడంటలో రసాయనాలు ఉంటాయి. ఈ ఉత్పత్తులన్నీ రసాయనాల మూలంగానే తయారవుతాయి. ఎక్కడైతే రసాయనాలు ప్రభావం చూపిస్తాయో.. అక్కడ ఆ రసాయనాలకు లోనయ్యే కారకాలు కూడా ఉంటాయి. ఇక్కడ చెప్పుకుంటున్న సౌందర్య సాధనాలు కూడా అంతే…
రసాయనాలతో తయారయ్యే షాంపులు, సబ్బుల గురించి ఏమోకానీ.. డియోడరెంట్లు మాత్రం చాలా ప్రమాదమట. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చెమట పట్టే సమయంలో అయినా అలా లేకపోయినా డియోడరెంట్ వాడటం అలవాటు. ఇది చెమటను దుర్వాసనను దూరం చేస్తుంది. అయితే దీన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి.
డియోడరెంట్ ఎలా పనిచేస్తుందంటే..
చర్మం ఆమ్లతను పెంచడం ద్వారా దుర్వాసనను నియంత్రించడంలో డియోడరెంట్ పనిచేస్తుంది. ముఖ్యంగా చంకల్లో దుర్వాసనకు ఈ డియోడరెంట్స్ మంచి ఉపశమనం. ఇవి దుర్వాసనను నియంత్రిస్తాయి కానీ చెమటను నియంత్రించవు. వీటిలో చెమట వాసన రాకుండా ఉండేందుకు పెర్ఫ్యూమ్‌ను ఉపయోగిస్తారు. దీనితో పాటు, ఆల్కహాల్ కూడా ఉంటుంది. దీన్ని చర్మానికి రాసుకుంటే చర్మం పొడిబారడంతోపాటు రంగు మారడం కూడా జరుగుతుంది.
అలర్జీలు
డియోడరెంట్లు కొన్నిసార్లు అలెర్జీలను కలిగిస్తాయి. ఇందులో చర్మంపై దద్దుర్లు, మొటిమలు, చర్మం ఎరుపుకు మారడం, దురద, మంట లేదా చర్మంపై వాపుతో పాటు, శ్వాసకోశ లక్షణాలు కూడా వస్తాయి. సాధారణంగా ఇది ఒక రకమైన కాంటాక్ట్ డెర్మటైటిస్. ఇది అల్యూమినియం, ఆల్కహాల్, కృత్రిమ సువాసనల సమ్మేళనం. డియోడరెంట్లో ఉండే పారాబెన్‌లు, రంగులు లేదా ఇతర రసాయనాల వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
ఇవి గుర్తుపెట్టుకోవాలి..
మొదటి విషయం మీ చర్మం గురించి అవగాహన. మీ చర్మం సున్నితంగా ఉంటే చాలా జాగ్రత్తగా డియోడరెంట్ని ఎంచుకోవాలి. వీలైతే.. చర్మ సంబంధ నిపుణుడిని సంప్రదించి మీ చర్మానికి తగినది ఎంచుకోవచ్చు.
శరీరంపై వచ్చే చెమట వల్ల ఎప్పుడూ దుర్వాసన రాదు. దుర్వాసన అనేది చర్మంపై పెరిగే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కాబట్టి మీరు శరీర దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే ముందుగా దాని కారణాన్ని తెలుసుకోవాలి. కారణం కాకుండా డియోడరెంట్ను ఎక్కువగా ఉపయోగించవద్దు. ఇష్టమొచ్చినట్టు వాడితే చివరకు వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రావొచ్చు.
డియోడరెంట్ ఎప్పుడూ చర్మంపై నేరుగా అప్లై చేస్తుంటారు. కాబట్టి.. డియోడరెంట్ను అప్లై చేసిన తర్వాత చర్మంపై మంట, దురద, పొడిబారినట్లు అనిపిస్తే, వెంటనే దానిని అప్లై చేయడం మానేయాలి. .
శుభ్రమైన కాటన్ దుస్తులు ధరించడం, రోజూ బాగా స్నానం చేయడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, శరీరంలోని అధిక వెంట్రుకలను తొలగించడం, ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల చెమట వాసన చాలా వరకు అదుపులో ఉంటుంది.
దుర్వాసన సమస్యను ఆర్మ్పిట్ డిటాక్స్, అలోవెరా, కొబ్బరి నూనె, టీ ట్రీ ఆయిల్, ఎప్సమ్ సాల్ట్ మొదలైన వాటి ద్వారా కూడా నియంత్రించవచ్చు.
డియోడరెంట్ వల్ల ఇబ్బంది ఏర్పడినప్పుడు ఇంటి చిట్కాలు పాటించినా ఉపశమనం కల్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.
◆నిశ్శబ్ద.