నిన్న సజ్జల, నేడు జగన్ కుటుంబం .. .వోటర్ల జాబితాలో అవకతవకలు
posted on Feb 15, 2024 @ 10:07AM
ఎపిలో వోటర్ల జాబితాలో తప్పుల తడక ఉందనే ఆరోపణలు మిన్నంటిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ స్వంత కుటుంబంలో కూడా వోటర్ల జాబితా పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు ఈ అక్రమాలు వెలుగుచూడటం గమనార్హం.
ఏపీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల వివరాలు కూడా తప్పుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పులివెందుల పురపాలక సంఘం పరిధిలో ఉన్న 138వ పోలింగ్ కేంద్రంలో జగన్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో జగన్ పెద్దమ్మ వైఎస్ భారతమ్మ పేరును వైఎస్ భారతి రెడ్డి అని ముద్రించారు. అంతేకాదు ఆమె భర్త జార్జ్ రెడ్డి పేరును కూడా తప్పుగా పేర్కొన్నారు. వయసు 60 సంవత్సరాలు అని ముద్రించారు.
నిరుడు ముఖ్యమంత్రి జగన్ ఫోటో మరో వోటర్ జాబితాలో ప్రత్యక్షమైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో సీఎం జగన్ ఫొటో ఉండడం సంచలనం రేపింది. దోర్నాల మండలం వై చెర్లోపల్లిలో జనపతి గురవమ్మ అనే మహిళ ఓటర్ స్థానంలో సీఎం జగన్ ఫొటో ఉంది. సదరు మహిళకు ఆ విషయం తెలియడంతో తమ ఫోటో కాకుండా జగన్ ఫొటో రావడం ఏంటని కంగు తిన్నారు. బిఎల్ వో తప్పిదంతోనే ఇది జరిగిన్నట్లు స్థానికులు ఆరోపించారు. అదే గ్రామంలో మరి కొందరి ఫొటో స్థానంలో ఏకంగా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేశారు. ఓటర్ల లిస్ట్ లో తప్పిదాలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.