ఇక మురిపించనున్న ఐపిఎల్
posted on Apr 3, 2011 @ 12:10PM
హైదరాబాద్: ప్రపంచకప్ సంరంభం ముగిసింది. కపిల్ డెవిల్స్ తర్వాత 28ఏళ్ల అనంతరం మహేంద్ర సింగ్ సారథ్యంలోని భారత్ జట్టు ప్రపంచకప్ గెలుచుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఈ ఆనందాన్ని అనుభవిస్తున్న తరుణంలో క్రికెట్ అభిమానులను ఐపిఎల్ మురిపించడానికి వస్తుంది. ప్రపంచ కప్పు ఆటలను అందరూ ఆస్వాదించినప్పటికీ ఐపిఎల్‌లో ఉండే మజా వేరు. 20 ఓవర్ల ఈ మ్యాచ్ యాక్షన్ చిత్రాన్ని తలపిస్తుంది. ఈ 20 ఓవర్ల పోరులో బంతి బంతికి ఉత్కంఠ, పరుగు పరుగుకి అభిమానులకు ఓ పులకింత. ధాటిగా ఫోర్లు, సిక్సులతో క్రికెట్ అభిమానులను అలరిస్తుంది. ఇలాంటి 20 ట్వంటీ మ్యాచ్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తారీఖునుండి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇది మే 28 తారీఖు వరకు కొనసాగుతుంది. ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీ అభిమానులను నలభై రోజులు అలరించింది. ఇక 20ట్వంటీ టోర్నీ మరో యాభై రోజులు అభిమానులను అలరించనుంది. ప్రపంచకప్, 20ట్వంటీ కారణంగా క్రికెట్ అభిమానులకు వరుసగా మూడు నెలలు పండగే పండగ. ప్రపంచకప్ సంరంభం ముగిసిన తర్వాత ఐపిఎల్‌కు ఐదు రోజులే ఉన్నందున అభిమానుల ఆనందానికి హద్దే ఉండదనటంలో సందేహం లేదు. అయితే ఈ సంవత్సరం గతంలో ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా పూణే, కోచి జట్లు కలిపి మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి.