వైసీపీ నేతల్లో అభద్రతా భావం.. జగన్ లో ఓటమి భయం!
posted on Jan 8, 2024 @ 9:30AM
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఇప్పుడు తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సిట్టింగుల మార్పుతో గెలుపు మంత్రాన్ని కనుగొన్నానని భావించారు. అయితే ఆ గెలుపు మంత్రం వికటించి ఇప్పుడు పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అయినా తనకు మాత్రమే సాధ్యమైన మొండితనంతో జగన్ వరుసగా సిట్టింగుల మార్పు జాబితాలను విడుదల చేస్తూ ముందుకు వెడుతున్నారు. ఆయన ధైర్యం ఏమిటంటే.. సిట్టింగులందరి చేతా దాదాపుగా విపక్ష నేతలను ఇష్టారీతిగా తిట్టించడం ద్వారా వారికి ఆయా పార్టీలలోకి ఎంట్రీ గేట్ లు మూతపడేలా చేశాను, కనుక సీటిచ్చినా, ఇవ్వకున్నా, స్థానం మార్చేసినా ఎవరూ కూడా తనను కాదని వెళ్లలేరన్నదే. అయితే షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో జగన్ లో ఆ ధైర్యం ఇంకెంత మాత్రం ఉండే అవకాశం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పటికే షర్మిల వెంటే తన నడక అని ప్రకటించేశారు. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం అదే దారిలో నడుస్తున్నారు. ఇక జగన్ కో దండం అంటే బయటకు వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన కాపు రామచంద్రారెడ్డి సైతం షర్మిల పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా జగన్ పూచికపుల్లల్లా తీసి పారేసిన సిట్టింగులకు షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ ధైర్యాన్నిస్తే.. జగన్ లోని ధైర్యాన్ని దిగజార్చేసింది కూడా షర్మిల కాంగ్రెస్ ఎంట్రీయే.
సరే అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ మరో 15 మంది సిట్టింగుల మార్పు జాబితాతో రెడీ అయిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో మంత్రులు సైతం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ సిట్టింగులలో పార్టీ హైకమాండ్ నుంచి.. అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అన్న టెన్షన్ పట్టుకుందంటున్నారు. అదే సమయంలో ఈ మూడో జాబితా విడుదల చేస్తే.. వీరిలో ఎంత మంది తనను ధిక్కరించి పార్టీ వీడుతారా అన్న బెరుకు జగన్ లో వ్యక్తం అవుతోందని అంటున్నారు.
ఇక మూడో జాబితాలో మంత్రి తానేటి వనితకు స్థాన చలనం తప్పదని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే మొదటి లిస్టులో 11 మందిని, రెండో లిస్టులో 27 మందిని, మొత్తంగా 38 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. చాలా చోట్ల సిట్టింగులకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. అలా జగన్ పక్కన పెట్టేసిన వారిలో మల్లాది విష్ణు, గోరంట్ల మాధవ్, పర్వత ప్రసాద్, మద్దాళి గిరి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వంటి వారు ఉన్నారు. ఈ రెండు జాబితాల తరువాత పార్టీలో అసమ్మతి భగ్గుమన్నా.. జగన్ ఇప్పుడు మూడో జాబితాతో సిద్ధమైపోయారంటున్నారు. ఈ జాబితాలో కూడా కొందరు మంత్రులకు షాక్ తప్పదని అంటున్నారు. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ పల్నాడు, గుంటూరు, కృష్ణాలో మినహా ఇతర జిల్లాలో అభ్యర్థులను మార్చరని చెబుతున్నా, తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ అంటే భయపడుతున్నారు. అదే సమయంలో జాబితా విడుదల చేయాలంటే జగన్ వెనుకాడుతున్నారంటేనా పార్టీలో ఎంతటి అయోమయ పరిస్థితులు నెలకొన్నాయో ఇట్టే అవగతమౌతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నందికొట్కూరు, ఆలూరు, కర్నూలు, శింగనమల, గూడూరు, చోడవరం, చింతలపూడి, పెందుర్తి, గోపాలపురం, కొవ్వూరు అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ను మార్చే అవకాశం ఉంది. అక్కడ కస్టమ్స్ ఆపీసర్ వేల్పుల ఆనంద్ కుమార్, డాక్టర్ సుధీర్ లపేర్లు విన్పిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కు స్థాన చలనమా? లేక మొండిచేయా అన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత అయితే లేదు కానీ, ఆయన సీటు మార్పు మాత్రం ఖాయమని అంటున్నారు.
అలాగే ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు కూడా జగన్ షాక్ ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఆలూరు నుంచి కప్పట్రాళ్ల బొజ్జమ్మ, చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షి, దివంగత మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజా రెడ్డి కుమార్తె హిమవర్షి రెడ్డి, శశికళ పేర్లు విన్పిస్తున్నాయి. అదే విధంగా కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు కూడా మొండిచేయి తప్పదని పార్టీ వర్గాల సమాచారం. అక్కడ ఇంతియాజ్ భాష, పూల బషీర్, కేడీసీసీ చైర్ పర్సన్ విజయ మనోహరి, ఎస్వీ మోహన్ రెడ్డిలలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. . శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కూడా షాక్ తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ శమంతకమణి, శ్రీనివాస మూర్తి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. చింతలపూడి నుంచి విజయరాజుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలిషా వర్గం ఇప్పటికే తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారు.
కొవ్వూరు ఎమ్మెల్యే, మంత్రి తానేటి వనితకు స్థాన చలనం తప్పదని అంటున్నారు. ఆమెను గోపాలపురం లేదా చింతలపూడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు పేరు గట్టిగా వినిపిస్తోంది. మొత్తంగా సిట్టింగుల మార్పు ప్రయోగంతో జగన్ పార్టీ నేతల్లో అభద్రతా భావాన్ని నింపడమే కాకుండా.. తనలోని భయాన్ని కూడా ప్రస్ఫుటంగా చాటుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.