కూలిన ఇండోనేషియా విమానం, 54మంది గల్లంతు
posted on Aug 17, 2015 6:41AM
ఇండోనేషియాలో త్రిగానా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆదివారం కూలిపోయింది. దానిలో విమాన సిబ్బందితో సహా మొత్తం 54 మంది ఉన్నారు. ఆదివారం ఉదయం పపువా ప్రావిన్స్ రాజధాని జయాపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి భారత కాలమాన ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఒక్సిబిల్ కి బయలుదేరింది. కానీ కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఓకేబెవ్ అనే జిల్లాలో తాంగాక్ పర్వతం వద్ద కూలిపోయినట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే సహాయ సిబ్బందిని అక్కడికి పంపడానికి ప్రయత్నించారు. కానీ దట్టమయిన అడవులు, కొండలతో నిండిన ఆ ప్రాంతానికి ఇంతవరకు ఎవరూ చేరుకోలేకపోయారు. కనుక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల, సిబ్బంది ఆచూకి ఇంకా తెలియలేదు. కొద్ది సేపటి క్రితమే అక్కడికి సహాయ సిబ్బంది చేరుకొని ప్రయానికుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ విమాన ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఆ దేశానికి చెందిన రెండు విమాన ప్రమాదాలు జరిగాయి. ఇది మూడవది. త్రిగానా ఎయిర్ లైన్స్ సంస్థ చరిత్రలో ఇంతవరకు 14 విమాన ప్రమాదాలు జరిగాయి. విమాన భద్రతా ప్రమాణాలు లేని కారణంగా ఆ సంస్థను ఐరోపా యూనియన్ చాలా కలం క్రితమే బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ నేటికీ ఆ విమాన సంస్థ తన విమానాలను నడుపుతూనే ఉంది. ఇలాగ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయానికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి.