యూఎస్ ఎన్నికల్లో ఐదుగురు ఎన్నారైల విజయం! మూడోసారి గెలిచిన రాజా క్రిష్ణమూర్తి
posted on Nov 5, 2020 @ 9:48AM
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ సంతతి నేతలకు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. యూఎస్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు నలుగురు ఇండియన్ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. మొదటి సారి బరిలో నిలిచినోళ్లు కొందరు ఓడిపోయారు. ఎక్కువగా డెమొక్రాట్ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న నేతలు చేసిన ‘సమోసా కాకస్’ ప్రచారం బాగానే పనిచేసింది. డాక్టర్ ఎమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు మంచి మెజారిటీతో విజయం సాధించారు. మరొక ఇండియన్ డాక్టర్ హిరాల్ తిపిర్నేని లీడింగ్‌లో ఉన్నారు.
భారత సంతతి రాజా క్రిష్ణమూర్తి డెమొక్రటిక్ పార్టీ తరఫున వరుసగా మూడోసారి యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌గా ఎన్నికయ్యారు. లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రీస్టన్ నెల్సన్‌పై రాజా ఘన విజయం సాధించారు. మొత్తం ఓట్లలో రాజా ఏకంగా 71 శాతం ఓట్లు దక్కించుకోవడం విశేషం. రాజా పేరెంట్స్‌ది తమిళనాడు కాగా, ఆయన న్యూఢిల్లీలో జన్మించారు. రాజా మొదటిసారి 2016లో యూఎస్ హౌస్‌కు ఎన్నికయ్యారు.
అమెరికాలోని కొన్ని చోట్ల ఇండియన్ల మధ్యే ప్రధాన పోటీ సాగింది. ఇండియన్ అమెరికన్ ఓటర్లే గెలుపోటముల్లో కీలకంగా మారారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన రో ఖన్నా మరో ఇండియన్ రితేశ్ టాండన్‌ను ఓడించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. రో ఖన్నాకు 50 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి. సమోసా కాకస్‌లో చాలా సీనియర్ మెంబర్ అయిన డాక్టర్ ఎమీ బేరా కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన 65 ఏళ్ల బజ్ ప్యాటర్సన్ను 25 శాతం ఓట్ల తేడాతో ఆయన మట్టి కరిపించారు.
2016లో గెలిచిన ప్రమీలా జయపాల్ మరోసారి విజయం సాధించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు గెలిచి చరిత్ర సృష్టించిన తొలి ఇండియన్ అమెరికన్ ఆమె. మళ్లీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ఆమె తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచిన డేవిడ్ ష్వూకెర్ట్పై డెమొక్రాట్ అభ్యర్థి హిరల్ తిపర్నేని లీడింగ్‌లో ఉన్నారు. అరిజోనా ఆరో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. ఆమె గెలిస్తే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన రెండో ఇండియన్ మహిళగా నిలుస్తారు.
న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి జెన్నిఫర్ రాజ్‌కుమార్ అనే లాయర్ ఎన్నికయ్యారు. న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు. డెమొక్రాట్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆమె.. రిపబ్లికన్ అభ్యర్థి జియోవనీ పెర్నాను ఓడించారు. 38వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుంచి ఆమె పోటీ చేశారు. న్యూయార్క్ సిటీకి ఆమె అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తారు. అంతకుముందు న్యూయార్క్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. లీగల్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ శాంక్చువరీ ఫర్ ఫ్యామిలీస్‌లో లీగల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. గృహ హింస, సెక్స్ ట్రాఫికింగ్, జెండర్ వయొలెన్స్ బాధితులకు అండగా నిలుస్తూ.. వారి తరఫున పోరాడుతున్నారు. ఆమె పనితీరు నచ్చి న్యూయార్క్ రాష్ట్రానికి ఇమిగ్రేషన్ అఫైర్స్ అండ్ స్పెషల్ కౌన్సెల్‌కు డైరెక్టర్‌గా నియమించారు గవర్నర్ ఆండ్రూ క్యువోమో.
కొన్ని చోట్ల డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల తరఫున పోటీ చేసిన మనోళ్లకు ఓటమి తప్పలేదు. టెక్సస్‌లోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రాట్ పార్టీ నుంచి పోటీ చేసిన చెందిన ప్రెస్టన్ కులకర్ణి .. రిపబ్లికన్ క్యాండిడేట్ ట్రాయ్ నెల్స్ చేతిలో ఓడిపోయారు. రిపబ్లికన్ నుంచి బరిలోకి దిగిన మంగా అనంతాత్ముల.. డెమొక్రాట్ అభ్యర్థి జెర్రీ కానలీ చేతిలో ఓడిపోయారు. వర్జీనియాలోని 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన పోటీ చేశారు.
మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగిన నిషా శర్మ 50 శాతానికిపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఆమెను డెమొక్రాట్ క్యాండిడేట్ మార్క్ డిశాల్నియర్ ఓడించారు.న్యూ జెర్సీ సెనేట్ కు పోటీ చేసిన రిపబ్లికన్ క్యాండిడేట్ రిక్ మెహతా ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ క్యాండిడేట్ సెనేటర్ కోరీ బుకర్ చేతిలో ఓడిపోయారు. మెహతాకు 37.9% ఓట్లు పోలవగా.. బుకర్కు 60.6% ఓట్లు వచ్చాయి. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా మెహతా పనిచేశారు.