భారత్ లో 9మంది ఐసిస్ కోసం పనిచేస్తున్నారు
posted on Oct 19, 2015 @ 10:26AM
హైదరాబాద్ నగరంలోని టోలి చౌక్ అనే ప్రాంతానికి చెందిన అఫ్శా జబీన్ అనే 38 ఏళ్ళు వయసుగల మహిళ దుబాయిలో ఉంటూ ఐసిస్ ఉగ్రవాదుల ముఠాలో భారత్ యువకులను చేర్పించే ప్రయత్నాలు చేస్తునందున అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇంటలిజన్స్ అధికారుల విచారణలో ఆమె భారత్ లో మొత్తం తొమ్మిది మంది యువకులు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు తెలిపింది. వారిలో ఇద్దరు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జమ్మూ కాశ్మీర్ లకు చెందినవారని ఆమె తెలియజేసింది. అయితే ప్రస్తుతం వారివల్ల ఎటువంటి ప్రమాదం లేదని, వారి కదలికలపై నిఘా పెట్టమని ఇంటలిజన్స్ అధికారులు మీడియాకి తెలిపారు.
చాలా కాలంగా దుబాయ్ లో ఉంటున్న అఫ్శా జబీన్ తనను తాను బ్రిటిష్ దేశాస్తురాలిగా చెప్పుకొనేది. ఇంటర్నెట్ ద్వారా ఇస్లాం మతానికి సంబంధించిన మత గ్రంధాలను, వివరాలను సేకరించే ప్రయత్నంలో ఆమెకు హైదరాబాద్ కు చెందిన సలాం మోహినుద్దీన్ అనే కెమికల్ ఇంజనీర్ తో పరిచయం ఏర్పడింది. అక్కడి నుండి ఆమె గమ్యం పక్కదారి పట్టింది. వారిరువురూ కలిసి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో భారత్ యువతీ యువకులను చేర్పించేందుకు సామాజిక వెబ్ సైట్లలో అందుకోసం అనేక గ్రూపులు సృష్టించి యువతను ఆకర్షించడం మొదలుపెట్టారు. వారిరువురూ ఇంకా ఎంతమందిని ప్రభావిద్తం చేసారో తెలియదు కానీ ప్రస్తుతం తొమ్మిది మంది ఐసిస్ ఉగ్రవాదుల మద్దతుదారులు భారత్ లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అఫ్శా జబీన్ ఇంటలిజన్స్ అధికారులకి తెలియజేసారు.