రైతులతో ప్రధాని చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం! అలా చేస్తే మోడీ రియల్ హీరోనే!
posted on Dec 18, 2020 @ 7:24PM
కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీపై దండెత్తారు. దేశ రాజధానిలోకి రాకుండా పోలీసులు అడ్డు కంచెలు వేసినా.. సరిహద్దులోనే సమర నినాదం వినిపిస్తున్నారు కర్షకులు. గజ గజ వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా అక్కడే తింటూ.. అక్కడే పడుకుంటూ 22 రోజులుగా అలు పెరగని ఆందోళన చేస్తున్నారు అన్నదాతలు. రైతుల పోరాటంతో ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని టిక్రి, సింఝూ ప్రాంతాలు ఇప్పుడు ఉద్యమ కేంద్రాలుగా మారిపోయాయి. ఉద్యమంలో పాల్గొంటూ ఇప్పటివరకు 25 మంది అన్నదాతలు అసువులు బాశారు. అయినా ఏమాత్రం వెనక్కి తగడ్డం లేదు రైతులు. కేంద్రం దిగొచ్చేవరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు.
ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. యూఎన్ కూడా వారిటి బాసటగా నిలిచింది. కెనడా ప్రధాని భారత రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలు అన్నదాతలకు అండగా నిలిచాయి. రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పలువురు ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్తలు డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం మాత్రం తన పంతం వీడటం లేదు. రోజురోజుకు ఉద్యమం తీవ్రతరమవుతున్నా సీరియస్ గా స్పందించడం లేదు మోడీ సర్కార్. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం కొందరు రైతులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అయితే వారంతా బీజేపీ అనుబంధ రైతు సంఘాల నేతలేనని తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న రైతుల్లో చీలిక తెచ్చేందుకు కేంద్ర కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రైతు ప్రతినిధుల పేరుతో తోమర్ తో చర్చలకు వెళ్లేవారంతా బీజేపీ కుట్రలో పావులుగా ఉన్నవారేనని చెబుతున్నారు.
రైతులను శాంతింప చేయాల్సింది పోయి వాళ్ల ఆందోళన ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తున్నారు కొందరు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రుల నుంచి గల్లీ నేతల వరకు రైతుల ఆందోళనలపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. రైతులకు ఖలిస్తానీయులు, మావోయిస్టులతోను లింక్ ఉందని బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేయడం దుమారం రేపింది. ఆందోళన చేస్తున్న అన్నదాతలను హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఖలిస్తానీయులుగా అభివర్ణించారు. రైతుల పేరుతో మోడీకి వ్యతిరేకంగా ఖలిస్తానీయులు నినాదాలు చేశారని చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులే రైతుల ఆందోళన వెనుక ఉన్నాయన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్. దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు విపక్షాలు రైతుల్ని వాడుకుంటున్నాయన్నారు. ఇంకొందరు బీజేపీ నేతలేమో కేవలం పంజాబ్ రైతులే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కేవలం ఒక్క శాతం రైతులు .. అది కూడా పంజాబీ రైతులకే కొత్త చట్టాలు నచ్చడం లేదని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
బీజేపీ నేతల కామెంట్లపై సిక్కు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పంజాబ్ రైతులకే ఉద్యమాన్ని పరిమితం చేసేలా కేంద్రం కుట్రలు చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో పంజాబ్ రైతులకు మాత్రమే సమస్య ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. పంజాబ్ రైతుల సమస్య అయితే ఇటీవల నిర్వహించిన బంద్ అన్ని రాష్ట్రాల్లో ఎలా విజయవంతమైందని అడుగుతున్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కువగా అసువులు బాసింది పంజాబీలేనని వారు గుర్తు చేస్తున్నారు. దేశ స్వాతంత్రం కోసం ఉరి తీసిన 121 మందిలో 93 మంది పంజాబీలే ఉన్నారని చెబుతున్నారు. జీవిత ఖైదు విధించిన 2 వేల 626 మందిలో 2 వేల 147 మంది పంజాబీలేనని లెక్కలు తీస్తున్నారు. ఇప్పుడు కేంద్రం వాదిస్తున్నట్లు అప్పుడు బ్రిటీష్ సర్కార్ కూడా స్వాతంత్ర సమస్య కేవలం పంజాబీలకేనని అనుకుంటే మిగితా దేశం ఇప్పటికి బానిసత్వంలోనే ఉండేదని సిక్కులు స్పష్టం చేస్తున్నారు.
రైతుల చేస్తున్న పోరాటాన్ని గౌరవించి వారితో కేంద్ర సర్కార్ చర్చలు జరిపితేనే బెటరనే అభిప్రాయమం మేధావుల నుంచి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందంటున్నారు. రైతుల దగ్గరకే మోడీ వెళితే.. ఆయన కూడా హీరోగా నిలుస్తారని చెబుతున్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాకా దేశాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరికింది. అయోధ్య రామాలయం, త్రిపుల్ తలాక్, జమ్మూ కశ్మీర్ సమస్యలు కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు రైతుల ఆందోళన విరమించేలా ప్రధాని మోడీ చొరవ తీసుకుని.. వారితో చర్చించి సమస్య పరిష్కరిస్తే.. ఇది కూడా ఆయన చరిత్రాత్మక విజయాల్లో ఒకటిగా నిలిచిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది.
మన దేశ రక్షణలో సిక్కులు, పంజాబీల పాత్రే గొప్పది. ఇండియా ఆర్మీలో ఎక్కువ మందే వారే ఉంటారు. దేశం కోసం ఏటా వందలాది ప్రాణాలు అర్పిస్తుంటారు. దేశ భక్తిలో సిక్కులతో ఎవరూ పోటీపడలేరని చెబుతారు. గతంలో సిక్కులకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుని రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇందీరా గాంధీ. నిజానికి సిక్కులు మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు. ప్రధాని మోడీ రెండు సార్లు అధికారంలో చేపట్టడంలో వారి సహకారం కూడా ఉంది. అందుకే రైతుల ఆందోళనను కేవలం పంజాబీ రైతుల సమస్యగా చూపి వారిపై విమర్శలు చేయడం ఆపితేనే బీజేపీకే మంచిదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది. లేదంటే గతంలో కాంగ్రెస్ కు జరిగినట్లే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి రావచ్చని కూడా కొందరు పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం తమ పంతాన్ని కొనసాగిస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తుందా లేక ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తుందో చూడాలి మరీ..