అమెరికాలో ఆంధ్ర వ్యక్తి అనుమానాస్పద మృతి
posted on Dec 31, 2012 @ 5:29PM
కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి అమెరికా లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు. నగరంలోని మంకమ్మతోటకు చెందిన గాలి వెంకట రెడ్డి(48), 12 సంవత్సరాల క్రితం అమెరికాకు వలస వెళ్ళాడు. అక్కడ ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటిలో ఆయన ఓ సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు.
ఆయన ప్రతి రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో తన ఇంటికి వస్తూ ఉండేవాడు.అయితే, గత శనివారం రాత్రి వంటి గంట వరకూ ఆయన ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య కవిత, వెంకట రెడ్డి వ్యాపార భాగస్వామి శైలేంద్ర రెడ్డికి ఫోన్ చేసింది. వీరిద్దరితో పాటు, ఆమె ఇంటికి సమీపాన ఉండే వెంకట రెడ్డి అనే మరో తెలుగు వ్యక్తి షాప్ కు వెళ్లి చూడగా వెంకట రెడ్డి అక్కడ నేలఫై పడి ఉన్నాడు. ఆయన నోటి నుండి, ముక్కు నుండి రక్తస్రావం అయి ఉన్నట్లుగా గుర్తించారు.
అయితే, వెంకట రెడ్డి షాప్ కౌంటర్లోని డబ్బు అలాగే ఉండటంతో ఇది దొంగల పని కాదని, నిందితునికి, వెంకట రెడ్డి కి ఉన్న పాత కక్షల కారణంగానే హత్య జరిగిఉంటుందని పోలీసులు భావించి, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుని వ్యాపార భాగస్వాములను కూడా పోలీసులు ప్రశ్నించారు.
వెంకట రెడ్డి దంపతులకు ప్రణీత్ అనే కుమారుడు ఉన్నాడు. ఆయన భార్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రెడ్డి మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద వాతావరణం నెలకొని ఉంది.