బీకేఎస్ అయ్యంగార్ కన్నుమూత
posted on Aug 20, 2014 @ 1:23PM
అయ్యంగార్ యోగా పద్ధతిని ఆవిష్కరించిన ప్రముఖ యోగా గురువు పద్మవిభూషణ్ బీకేఎస్ అయ్యంగార్ పూణెలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన 95 సంవత్సరాల పండు వృద్ధాప్యంలో కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యతోనే ఆయన్ని పూణెలోని ఆస్పత్రిలో చేర్చారు. దీనికితోడు మూత్రపిండాలు కూడా విఫలం కావడంతో ఆయన కన్నుమూశారు. బీకేఎస్ అయ్యంగార్ యోగా గురువుగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, ఈ సంవత్సరంలో పద్మ విభూషణ్ సత్కారాలు పొందారు. యోగా గురించి ఆయన అనేక గ్రంథాలు రాశారు. 95 ఏళ్ళ వృద్ధాప్యంలో కూడా ఆయన యోగాసనాలు వేసేవారు. అయ్యంగార్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అయ్యంగార్ అభిమానులకు సంతాపం తెలిపారు. అయ్యంగార్ సేవలు కొన్ని తరాల పాటు గుర్తుండిపోతాయని, ప్రపంచంలోని చాలామందికి ఆయన యోగాను పరిచయం చేశారని ఆయన అన్నారు.