బియ్యం బాబోయ్ బియ్యం.. అమెరికాలో ఎన్నారైల గాభరా
posted on Jul 22, 2023 @ 12:02PM
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం విధించిన నిషేధం అమెరికాలోని ఎన్నారైల పై తీవ్ర ప్రభావం చూపింది. రా రిటైల్ ధరలనునియంత్రించి దేశీయంగా సరఫరాను పెంచడానికి భారత ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తే.. ఆ ప్రభావం ఒక్క సారిగా అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైలపై పడింది. ఇక్కడ ఇలా నిషేధ ప్రకటన వెలువడిందో లేదో.. అమెరికాలోని ఎన్నారైలు బియ్యం కోసం దుకాణాల ముందు బారులు తీరారు.
ఒక్క సారిగా భారత స్టోర్ట్స్ వద్ద రద్దీ పెరగడంతో తోపులాటలు సైతం జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా భారత్ లో నిషేధం ప్రకటేన వెలువడగానే డిమాండ్ ను ఊహించిన వ్యాపారులు అమెరికాలో బియ్యం ధరలను ఒక్క సారిగా పెంచేశారు. ఈ మేరకు ఆయా దుకాణాల వద్ద బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే వాస్తవానికి భారత్ నిషేధం విధించినది బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను మాత్రమే. బాస్మతి బియ్యం ఎగుమతులపై ఎటువంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఎగుమతి అయ్యే బియ్యంలో బాస్మతీ బియ్యానిదే అధిక వాటా. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు పాతిక శాతం మించి ఉండవు. బాస్మతీ బియ్యం ఎగుమతుల విషయంలో ఎటువంటి ఆంక్షలూ లేవని భారత ప్రభుత్వం స్పష్టం చేసినా అమెరికాలోని ఎన్నారైల్లో ఈ స్థాయిలో ఆందోళన వ్యక్తమౌతుండటం విశేషం.
అసలు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడానికి ముందుగానే.. భారత్ నుంచి అటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాతో ఎన్నారైలు పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్లే ప్రస్తుతం అమెరికాలో బియ్యానికి కొరత ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఇండియాలో బియ్యం ఎగుమతులపై నిషేధం ప్రకటన అమెరికాలోని ఇండియన్లలో గాభరా పెంచింది. అదే సమయంలో అక్కడ బియ్యం ధరలకు ఒక్క సారిగా రెక్కలు రావడానికి కారణమైంది.