బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు ఆధిక్యం
posted on Dec 23, 2022 @ 4:24PM
బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మీర్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 19 పరుగులతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
అయితే ఆరంభంలోనే ఒవర్ నైట్ బ్యాట్స్ మెన్ రాహుల్, శుభ్ మన్ గిల్ ల వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలోనే పుజారా (24), కోహ్లీ (24) కూడా పెవిలియన్ బాట పట్టడంతో 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా పీకలోతు కష్టాల్లో పడింది. అయితే రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొని టీమ్ ఇండియాను ఆదుకున్నారు. ఈ క్రమంలో ఇరువురూ హాఫ్ సెంచరీలు సాధించారు.
ముఖ్యంగా రిషభ్ పంత్ తనదైన శైలిలో చెలరేగి ఆడాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో మోదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పంత్ ఔటౌన తరువాత టీమ్ ఇండియా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. శ్రేయస్ అయ్యర్ 84 పరుగులు చేసి ఔటయ్యారు. మిగిలిన వారంతా ఇలా వెళ్లి అలా వచ్చేశారు.
దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 314 పరుగుల వద్ద ముగిసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగుల ఆధిక్యత సాధించింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్, మెహందీ హసన్ మిరాజ్ లు చెరో నాలుగు వికెట్లూ పడగొట్టారు.