చైనాకు భారత్ మరో పెద్ద షాక్.. పబ్జీ సహా 118 యాప్ లు బ్యాన్
posted on Sep 2, 2020 @ 6:43PM
ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం చైనాకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. గత కొద్దిరోజులుగా సరిహద్దు వివాదం పై చైనా ఒకపక్క భారత్ తో చర్చలు జరుపుతూనే మరోపక్క సరిహద్దుల్లో దుందుడుకుగా వ్యవహరిస్తూండటంతో కేంద్రం తాజాగా మరికొన్ని చైనీస్ యాప్‌లపై వేటు వేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్ పబ్జీతో పాటు మరో 118 చైనా మొబైల్ యాప్ లపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పబ్జీపై నిషేధం విధించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో వెంటనే భారత్‌లో ఈ గేమింగ్ యాప్‌ను అందుబాటులో లేకుండా అటు గూగుల్ ప్లే స్టోర్ నుండి, ఇటు యాపిల్ ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించారు. ఈ పబ్జీ యాప్‌ను మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్ టాక్ తో సహా మరో 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ పబ్జీ యాప్ ను నిషేధించాలని గత కొంత కాలంగా తల్లితండ్రులు ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఒక మాతృమూర్తి దీనిని నిషేధించాలని ఏకంగా ప్రధానికి కూడా విజ్ఞప్తి చేసింది. ఈ యాప్ వ్యామోహంలో పడి కొంతమంది యువత తమ సమయాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తించడం కూడా మనం చూస్తున్నాం. మరి కొంత మంది టీనేజర్లయితే తల్లితండ్రులు తమను ఈ గేమ్ ఆడనివ్వడం లేదని ఏకంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. చివరికి కారణమేదైనా ఈ యాప్ ను మనదేశంలో బ్యాన్ చేయడం భారత్ లోని తల్లి తండ్రులకు పెద్ద ఊరట అనే చెప్పాలి.