ఇండియా - చైనా భాయీ భాయీ
posted on Jun 9, 2014 8:11AM
ఇండియా-చైనాల మధ్య ఆదివారం జరిగిన చర్చలు స్నేహపూరిత వాతావరణంలో విస్తృత స్థాయిలో సాగాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య దాదాపు మూడు గంటలపాటు జరిగిన చర్చల్లో వివాదాస్పద సరిహద్దు అంశంతోపాటు అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాలలో... 1. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మించడం, 2. కొందరు భారతీయులకు ‘ప్రత్యేక వీసాలు’ జారీచేయడం,3. ఇటీవల జరిగిన దురాక్రమణలు తదితర సమస్యలను పరిష్కరించే మార్గాలపై దృష్టి పెట్టడం వున్నాయి. ఈ అంశాలపై సాధ్యమైనంత త్వరలో తగిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు నిర్ణయించారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నరేంద్రమోదీ సారథ్యంలో భారత కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు తన ప్రత్యేక దూతగా విదేశాంగ మంత్రి వాంగ్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పంపించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అత్యంత ప్రాచీనమైన భారత నాగరికతకు కొత్త శక్తిని అందించిందంటూ వాంగ్ కితాబునిచ్చారు. భారత-చైనా పరిణామాలను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకుంటూ మైత్రిని పెంచే చర్యలను చేపడుతూనే పరస్పర మనోభావాలను, ఆకాంక్షలను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని రెండు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.