పతనం అంచున పాక్
posted on Jan 16, 2013 @ 6:10PM
మనకన్నా కొన్ని గంటలముందే స్వాతంత్రం పొందిన పాకిస్తాన్, నాటి నుండి నేటి వరకు ఏనాడు కూడా నిలకడగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోలేకపోయింది. మళ్ళీ ఈరోజు కూడా ఏ క్షణాన్నయినా కుప్ప కూలిపోయేలా ఉంది.
కెనడా దేశం నుండి తిరిగివచ్చిన తెహర్-ఉల్-కద్రి నాయకత్వంలో వేలాది పాక్ ప్రజలు గత రెండు రోజులుగా వీదులలోకి వచ్చి సర్వవిధాల భ్రష్టుపట్టిపోయిన పర్వేజ్ ప్రభుత్వం దిగిపోయి, పార్లమెంటును రద్దు చేయాలనీ కోరుతూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అది చాలదన్నట్లు, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని పర్వేజ్ అష్రఫ్ ను 24గంటలలోపుగా అరెస్ట్ చేయాలనీ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ప్రజలకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న “కద్రి’ పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వంపై ప్రయోగించిన మిస్సైల్” అని పాక్ పత్రికలూ వర్ణిస్తున్నాయి. మరో వైపు ఆ కధనాలు నిజం చేస్తున్నట్లు కద్రి తన ప్రసంగంలో పాక్ సైన్యాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. పాక్ సైన్యం, న్యాయ వ్యవస్థ రెండూ కూడా దేశాన్ని కాపడుతున్నాయని అయన అన్నారు.
ఏ క్షణానయినా కుప్ప కూలేలా ఉన్న తన ప్రభుత్వ పరిస్థితి, సైన్యం అండ చూసుకొని తిరుగుబాటు చేస్తున్న కద్రిని చూసి, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారి తన కుటుంబంతో సహా దుబాయ్ పారిపోయినట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ విదంగా పాకిస్తాన్ లో సంక్షోభం తల ఎత్తడం ఇది మొదటిసారీ కాదు, అటువంటి పరిస్థితుల్లో దేశం విడిచి పారిపోవడం ఆ దేశాది నేతలకి కొత్తా కాదు. మళ్ళీ పరిస్థితులు అనుకూలించినప్పుడు తిరిగిరావడం, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడం కూడా అక్కడ రివాజే.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల కారణంగానే పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రజల దృష్టి మళ్ళించేందుకు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు సృష్టించింది. అయినా ఫలితం లేకపోగా, అది పాల్పడిన హేయమయిన చర్యకు ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది.
ఈరోజు మన సైనికులు, భారతీయ సరిహద్దుల వద్ద పాక్ సైనికులు ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్లను కనుగొనడంతో, భారత ప్రభుత్వం మరింత ఆగ్రహించింది. 60సం.ల వయసు దాటిన పాక్ జాతీయులకి ఈ రోజు నుండి వాఘా సరిహద్దు వద్ద భారత్ లో ప్రవేశించేందుకు అక్కడికక్కడే వీసాలు జారీ చేయాలనుకొన్న భారత ప్రభుత్వం, ఆ ఆలోచనను విరమించుకొంది. అంతేగాక, మన దేశంలో హాకీ ఆడేందుకు వచ్చిన పాక్ హాకీ క్రీడాకారులను వెనక్కి తిప్పి పంపేసింది. భారత ప్రభుత్వం కన్నా వేగంగా స్పందించిన నరేంద్ర మోడీ, ‘వైబ్రాంట్ గుజరాత్’ వ్యాపార సదస్సులో పాల్గొనడానికి వచ్చిన పాక్ ప్రతినిధులను వారి హోటల్ నుండే వెనక్కి త్రిప్పి పంపేశాడు.
ప్రజల దృష్టి మళ్ళించేందుకు సరిహద్దుల వద్ద పాక్ ప్రభుత్వం చేసిన ప్రయోగం ఈ విదంగా వికటించడమే గాకుండా, ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న ఇరు దేశాల సబందాలను మరో మారు ఘోరంగా దెబ్బతీసింది. ఇంతచేసినా అక్కడ పాక్ ప్రభుత్వం నిలబడే పరిస్థితిలో లేదిప్పుడు.
అయితే, ఆ దేశంలో అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం అందరికన్నా ముందు మన దేశం పైనే తీవ్రంగా ఉంటుంది. దేశంలో నిర్భయంగా తిరుతున్న ముష్కర మూకలు, ప్రభుత్వాన్ని లోబడి పనిచేయడానికి ఇష్టపడని సైన్యాదికారులు, మరో వైపు తాలిబాన్లతో నిండిన పాకిస్తాన్ ఒక విద్వంసక శక్తిగా మారే అవకాశం ఉంది. అందుకే అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని మన దేశం ఎల్లపుడూ కోరుకొంటుంది. అయితే, అది ఎప్పటికీ తీరని కలగానే మిగిలిపోతోంది.