ఇంటిని చక్క దిద్దుకోలేని పాక్

 

నియంత్రణ రేఖ దాటివచ్చి భారత సరిహద్దులోకి జోరబడటమే గాక, ఇద్దరు భారతీయ సైనికులను అతి కిరాతకంగా చంపిన పాక్ సైన్యం, ఎన్నివిమర్శలు కురుస్తున్నా దున్నపోతూమీద వానపడినట్లు లెక్క జేయకుండా గత మూడు రోజులుగా జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సరిహద్దుల వద్ద భారత సైనికులపై కాల్పులు జరుపుతోంది. జరిగిన తప్పును వెంటనే సవరించుకోవలసింది పోయి, ఇటువంటి సమస్యలో ఇర్రుకొన్న ప్రతీసారీ ఆదేశం ఆడే నాటకాన్నే మళ్ళీ పాక్ ఇప్పుడు ఆడుతోంది. భారత్ సైనికులే తమ సరిహద్దులలోకి జొరబడి జరిపిన కాలుపుల్లో తన సైనికుడు ఒకడు చనిపోయాడని, అయినా కూడా ఈ సంఘటన ఇరుదేశాల మద్య జరుగుతున్నశాంతి ప్రక్రియలకు అడ్డంకి కాబోదని చెపుతూ, తప్పు భారత్ దే అయినా తాము ఓరిమితో ఉన్నట్లు మాట్లాడుతూ అతితెలివి ప్రదర్శిస్తోంది.

 

అంతే గాక, కాశ్మీర్ అంశాన్ని ఎలాగయినా అంతర్జాతీయ వేదికల మీదకు లాగి, భారత్ ను ఇరకాటంలో పెట్టాలని చూసే పాక్, ఈ సంఘటను ఆధారంగా చేసుకొని మరోసారి ఐక్యరాజ్య సమితి జోక్యం కోరగానే, భారత్ పాక్ కుయుక్తులను పసిగట్టి, ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని నిర్ద్వందంగా తిరస్కరించి తెలివిగా మసులుకొంది. అంతే గాకుండా, తన సహనానికి ఈవిదంగా పరీక్షలు పెట్టి శాంతి ప్రక్రియలకు విఘాతం కలిగించవద్దంటూ పాక్ కు తీవ్రస్వరంతో హెచ్చరికలు జారీ చేసింది. కానీ, వాటిని పెడచెవినపెడుతూ పాక్ ఇంకా సరిహద్దుల వద్ద భారత్ సైనికులపై కాల్పులు జరుపుతూనే ఉంది.

 

అయితే, పాక్ ఉండుండి ఇటువంటి కవ్వింపు చర్యలకు ఎందుకు పాల్పడుతోంది అని ఆలోచిస్తే, తన దేశంలో అరాచక పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పాక్ ప్రజలు ప్రభుత్వంపై కన్నెర్ర చేసినప్పుడల్లా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ వారి దృష్టిని మళ్ళించే ప్రయత్నంగా చెప్పవచ్చును. అంతే గాకుండా, టెర్రరిస్ట్ మూకలకు నెలవయిన పాకిస్తాన్లో సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్న వారికి భయపడి వారిని నిత్యం సంతృప్తి పరిస్తే తప్ప ప్రభుత్వం మనుగడ సాగించలేని అసహాయ పరిస్థితిలో ఉన్నదున ఇటువంటి చర్యలకు ఒడిగడుతూ ఉండవచ్చును. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను ఒక అంటరాని దేశంగా చూస్తున్నపటికీ, పాక్ ఉగ్రవాదానికి వత్తాసు పలుకుతూ తన పరిస్థితిని మరింత దిగాజార్చు కొంటోంది. అయినాకూడా ప్రపంచ దేశాల ముందు మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శించక తప్పట్లేదు.

 

పాకిస్తాన్ లో శాంతి నెలకొనే వరకూ, ఆ దేశసమస్యలు కూడా మనకి ఈ విదంగా తలనొప్పులు తేకమానవు. అయితే, పాకిస్తాన్ లో శాంతి ఎప్పటికయినా నేలకొంతుందా అంటే అనుమానమే. అంటే, మనకీ పాక్ తో తలనొప్పులు శాశ్వితమే అనుకోక తప్పదు. ఇంటిని చక్క దిద్దుకోలేని పాకిస్తాన్ పోరుగింటికీ నిప్పు పెట్టాలని చూడడం దారుణం.