బాసర బంద్.. ఎందుకంటే..?
posted on Jan 3, 2023 @ 11:30AM
హిందూ దేవుళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. గత ఏడాది డిసెంబర్ లో అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి అనుచితంగా వ్యాఖ్యానించడం మరుగున పడక ముందే.. రాజేష్ రెంజర్ల అనే వ్యక్తి బాసర అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాసర సరస్వతి అమ్మావారిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, జనం మంగళవారం (జనవరి 3) స్వచ్చంధంగా బంద్ ను పాటిస్తున్నారు.
అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బంద్ తో బాసర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బాసర ఆలయ అర్చకులు కూడా నిరసన కు దిగారు. సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాజేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఇంకొకరు ఎవరూ హిందూ దేవుళ్లను ఇలా దూషించకుండా కఠినాతి కఠిన చట్టాలు తేవాల్సిందేనంటూ స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో నిత్యం భక్తులతో కళకళలాడే బాసర ఈ రోజు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. చదువుల తల్లిపై తప్పుడు వాఖ్యలు చేసిన రాజేష్ రెంజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. బంద్ నేపథ్యంలో భారీ బలగాలను మోహరించారు.