వయసులో తాగితే మెదడు గతి అంతే!
posted on Dec 10, 2016 8:53AM
మ్యదపానం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకో పరిశోధనా వెలువడే కొద్దీ మద్యపానం వల్ల ఊహకి అందని సమస్యలెన్నో ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఫిన్లండులో సరికొత్తగా జరిగిన ఓ పరిశోధనతో, వయసులో మద్యపానాన్ని సేవించడం వల్ల, పిల్లలు మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తేలుస్తోంది.
టీనేజిలో ఉండగా
ఫిన్లండుకి చెందిన పరిశోధకులు ఒక 62 మంది యువత నుంచి వారి ఆహారపు అలవాట్లకి సంబంధించిన వివరాలను సేకరించారు. ముందుగా ఒక పదేళ్ల క్రితం వారంతా టీనేజి వయసులో ఉన్నప్పుడు ఈ వివరాలను సేకరించారు. ఆ తరువాత ఐదేళ్ల క్రితమూ, ఏడాది క్రితమూ ఇవే వివరాలను సేకరించారు. ఇందులో భాగంగా వారి మందు అలవాట్లను గమనించారు. వీరిలో ఒక 35 మంది టీనేజిలో ఉండగా తెగ తాగేవారని తేలింది. మరో 27 మంది అప్పుడప్పుడూ మందుని రుచి చూసేవారట.
మెదడుని పరిశీలిస్తే
టీనేజిలో ఉండగా బాగా తాగేవారికీ, తక్కువ తాగేవారి ఆరోగ్యానికీ మధ్య మొదట్లో ఎలాంటి వ్యత్యాసమూ కనిపించలేదు. డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులూ అగుపించలేదు. కాకపోతే బాగా మందు తాగేవారు, మందుతో పాటుగా సిగిరెట్లు కూడా ఎక్కువ తాగుతున్నట్లు మాత్రమే తేలింది. కానీ పెద్దయ్యాక వారి మెదడుని గమనిస్తే, రెండు విభాగాల మధ్య స్పష్టమైన తేడాలు బయటపడ్డాయి. వారిలో మెదడు వికసించిన తీరులో మార్పు కనిపించింది.
గ్రే మేటర్
టీనేజిలో తెగ తాగిన యువత మెదడులోని ‘గ్రే మేటర్’ అనే పదార్థం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. మనలో జ్ఞాపకశక్తినీ, ఉద్వేగాలనీ, విచక్షణనీ, ఆత్మస్థైర్యాన్నీ నియంత్రించడంలో ఈ ‘గ్రే మేటర్’ది కీలక పాత్ర. మెదడులో ఇలాంటి లోటు చోటు చేసుకోవడం వల్ల టీనేజిలో బాగా తాగేసినవారిలో నానారకాల మానసిక సమస్యలూ ఏర్పడినట్లు గమనించారు. సమాజానికి దూరంగా ఉండటం, క్రుంగుబాటు వంటి సమస్యలు ఎదుర్కోవడం, చదువులో వెనబడటం వంటి ఇబ్బందులెన్నింటినో ఎదుర్కొన్నారట. దీనికి తోడు శాశ్వతంగా మద్యపానానికి బానిసైపోయే ప్రమాదంలోనూ మునిగిపోయారు.
ఖచ్చితమైన కారణం
టీనేజిలో విచ్చలవిడిగా తాగితే మెదుడు దెబ్బతినడానికి కారణం లేకపోలేదు. పిల్లలు 20 ఏళ్ల వయసుకి వచ్చేవరకు వారి మెదడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ కాలంలో కనుక మద్యానికి బానిసైతే, ఎదిగే మెదడు దెబ్బతినక మానదు. అందుకనే పిల్లల అలవాట్లను తల్లిదండ్రులు, తోటిమిత్రలు, ఉపాధ్యాయులు... ఓ కంట కనిపెడుతూ ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ టీనేజి పిల్లలు తెలిసీ తెలియక మద్యానికి బానిసలైనా... వెంటనే వారిలో ఆ అలవాటుని కనుక మాన్పించగలిగితే, తిరిగి మెదడులోని గ్రే మేటర్ పుంజుకోవడాన్ని గమనించారు. అలా కాకుండా దీర్ఘకాలం పాటు మద్యానికి బానిసగా కొనసాగితే, మెదడుకి కోలుకోలేని నష్టం ఖాయమట.
- నిర్జర.