ఐ బొమ్మ సినిమాల‌ను...చాటుగా ఎలా షూట్ చేస్తుందో తెలుసా!?

 

నువ్వీ త‌ప్పెందుకు చేస్తున్నావ్ అంటే.. మీరంతా ఇన్నేసి త‌ప్పులు చేస్తున్నారు కాబ‌ట్టి! అన్నాట్ట ఒక నిందితుడు.. స‌రిగ్గా అలాగే ఉంది ఐ బొమ్మ వ్య‌వ‌హారం. కావాలంటే చూడండీ.. చిన్న సినిమాలే కాదు పెద్ద పెద్ద సినిమాల పాలిటి కూడా మెయిన్ విల‌న్ గా మారిపోయిందీ బొమ్మ ఉర‌ఫ్ బెప్పం టీవీ పైర‌సీ సైట్.

ఒక మ‌నిషి ఖ‌ర్చు చేసే వినోద వ్య‌యాన్ని దాదాపు తగ్గించేసిన ఐ బొమ్మ‌.. సినిమా వాళ్ల‌ను మాత్రం దారుణంగా దెబ్బ తీస్తోంది. ఈ సినిమా బాగుంద‌న్న పాజిటివ్ టాక్ వ‌చ్చేలోపు ఇందులో టీజ‌ర్ వేసి మ‌రీ  రిలీజ్ చేసేస్తున్నారు. రీసెంట్ గా ఓజీని క‌మింగ్ సూన్ అని చెప్పి మ‌రీ వ‌దిలారు. క‌నీసం ఒక‌టీ రెండు రోజుల టైం కూడా ఇవ్వ‌కుండా ఈ పైర‌సీ సైట్లో ప్ర‌తి సినిమా ప్ర‌త్యక్ష‌మ‌వుతోంది. 

ఈ పైర‌సీ సినిమాల‌ను వీరెలా తీస్తారో కూడా వివ‌రించారు పోలీసులు. స్టాండ్ బై యాప్ ని త‌మ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటారు.. సినిమా ఎలా తీసినా స‌రే అది స‌రి చేసి ఒక వీడియో రూపొందించి డెలివ‌రీ చేస్తుంది. ఎక్స్ ట్రా మ‌నీ కోసం కిర‌ణ్ వంటి వారు ఈ ప‌ని చేస్తుంటార‌ని చెబుతున్నారు పోలీసులు.

ఇటీవ‌ల ప‌ట్టుబ‌డ్డ ఏసీ టెక్నీషియ‌న్ కిర‌ణ్ చేస్తోంది ఇదేనంటారు పోలీసులు. వీర్ని క్యామ్ కాడ‌ర్స్ అంటారు. అమ‌లాపురానికి చెందిన కిర‌ణ్ ఏసీ టెక్నీషియ‌న్ గా ప‌ని చేస్తూ మ‌రింత ఎక్కువ‌ డ‌బ్బు అవ‌స‌రానికై ఈ ఫీల్డ్ లోకి వచ్చాడని చెబుతారు పోలీసులు. ఇత‌డ్ని ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్న పోలీసుల‌కు ఈ మొత్తం నెట్ వ‌ర్క్ ఎలా న‌డుస్తుందో అర్ధ‌మైం పోయింది. పోలీసులు త‌మ‌పై నిఘా పెట్టార‌ని తెలిసిన ఐ బొమ్మ ఇటీవ‌ల ఒక మెసేజ్ రిలీజ్ చేసింది.  

ఇందులో ప్ర‌ధాన‌ చ‌ర్చ‌నీయాంశం ఏంటంటే హీరోల‌కు అంతంత రెమ్యున‌రేష‌న్లు ఎందుక‌న్న‌ది.  నిజానికి ఒక సినిమాలో స‌గం క్యాస్టింగ్ కి స‌రిపోతుంది. అందులోనూ స‌గం హీరో కి వెచ్చించాల్సి వ‌స్తుంది. ఇక్క‌డ ఐబొమ్మ వాడికి తెలియాల్సింది ఏంటంటే, హీరో ఆ సినిమాకు మెయిన్ మార్కెట్ లీడ‌ర్.

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ అంటూ గ‌తంలో..  ప‌వ‌న్, మ‌హేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ అంటూ ఇప్పుడూ ఒక మార్కెట్ విస్త‌ర‌ణ జ‌రిగింది. ఈ మార్కెట్ ఆయా న‌టుల సినిమాల క‌లెక్ష‌న్ల‌ను బ‌ట్టీ ఏర్ప‌డుతుంది. చిరంజీవికి మెగా స్టార్ అనే బిరుదు ఊర‌కే ఇవ్వ‌లేదు.. ఆయ‌న సినిమా క‌లెక్ష‌న్ల‌ను బ‌ట్టీ ఇచ్చారు. 

ఇప్పుడంటే బాల‌కృష్ణ‌కు న‌ట సింహ అంటూ ఏవో బిరుదులున్నాయి. కానీ, గ‌తంలో బాల‌కృష్ణ‌కు బాక్సాఫీస్ బోనాంజా అనేవారు. అంటే బాల‌కృష్ణ సినిమాగానీ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ క‌లెక్ష‌న్ల వ‌ర‌ద అంత తేలిగ్గా ఆగ‌దు. ఇప్ప‌టికీ కొన్ని థియేట‌ర్ల‌లో బాల‌య్య సినిమాలు నాన్ స్టాప్ గా న‌డుస్తుంటాయంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇక నాగార్జున, వెంక‌టేష్ సంగ‌తి స‌రే స‌రి. నాగార్జున- శివ వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాక‌లు  కేరాఫ్ అయితే, వెంక‌టేష్- చంటి త‌ర‌హా ఫ్యామిలీ ఎంట‌ర్టైనర్స్ కి పెట్టింది పేరు. 

ఇక ప్రెజంట్ జ‌న‌రేష‌న్ హీరోల‌కూ ఒక మార్కెట్ ఉండ‌టం ఆ మార్కెట్ ప్ర‌కార‌మే.. వారి వారి రెమ్యున‌రేష‌న్లు ఇవ్వ‌డం జ‌రుగుతోంది. ప్రొడ్యూస‌ర్లు కూడా ఏం ఊర‌కే డ‌బ్బులు ఇవ్వ‌రు. వారికున్న మార్కెట్ ప‌రిధిని బ‌ట్టీ పారితోష‌కాలుంటాయి.

చిరంజీవి చెప్ప‌డం కూడా అదే.. జ‌నం థియేట‌ర్ల బాట ప‌ట్టాలంటే ఓటీటీలో తెలుగు డ‌బ్ అవుతోన్న హాలీవుడ్ రేంజ్ త‌ర‌హా మూవీస్ మ‌న‌మూ తీయాల‌నే ఇంత ఖ‌ర్చని చెప్పుకున్నారాయ‌న‌. తానేదో పెద్ద తెలుగు సినిమా ఫీల్డ్ ని ఉద్ద‌రించ‌డానికి వ‌చ్చిన రిఫార్మ‌ర్ లా.. ఈ ఐ బొమ్మ హ్యాండ్ల‌ర్ మెసేజీలు పాస్ చేయ‌డం. చేసిన త‌ప్పుకు బ‌దులు చెప్ప‌మంటే హీరోల పారితోష‌కాల‌ను నిల‌దీయ‌డం.. స‌రికాదంటారు పోలీసులు.. అది వాళ్లు వాళ్లు చూసుకుంటారు. మ‌ధ్య‌లో వీళ్లెవ‌ర‌ని అంటారు అధికారులు. 

1957- కాపీ రైట్ చ‌ట్టం ప్ర‌కారం పైర‌సీ ఒక నేరం. 2019లో పైర‌సీ రాకాసిని ఎదుర్కోడానికి ఈ చ‌ట్టాన్నిస‌వ‌రించారు కూడా. దీని ప్ర‌కారం చట్టవిరుద్ధంగా సినిమా రికార్డింగ్ చేయడం, పంపిణీ చేయడం వంటివి తీవ్ర స్తాయి నేరాలుగా పరిగణిస్తారు. పైర‌సీ చేసిన‌ట్టు రుజువైతే ఎలాంటి శిక్ష‌లు ఉంటాయో చూస్తే.. మూడేళ్ల పాటు జైలు శిక్ష‌, భారీ జ‌రిమానా విధిస్తారు. నాలుగేళ్లుగా పైర‌సీ చేస్తోన్న‌ కిర‌ణ్ ద్వారా ఇండ‌స్ట్రీకి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయ‌ల ఆర్ధిక న‌ష్టం సంభ‌వించిందని అంచ‌నా వేస్తున్నారు. కాబ‌ట్టి ఇత‌డికి, ఇత‌గాడి వెన‌కున్న ఐబొమ్మ నెట్ వ‌ర్క్ కి పెద్ద ఎత్తున జ‌రిమానాతో పాటు శిక్ష కూడా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.
 

న్యూ ఇయర్ వేడుకలు...పబ్‌లపై ఈగల టీమ్ దాడులు

  మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా, హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పార్టీ నిర్వాహకులు, పబ్బులు యువతను ఆకర్షించేలా ప్రత్యేక వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై ఈగల్ టీమ్ ప్రత్యేక నిఘా పెట్టింది. కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో దాడులు చేశారు.  14 మందికి  డ్రగ్ టెస్ట్ చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఐదుగురు యువకులు,  ముగ్గురు యువతులు ఉన్నారు. కాగా గత 10 రోజులుగా ఈగల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 27 మంది కస్టమర్స్, ఐదుగురు నైజీరియన్స్ మహిళలను అరెస్ట్ చేశారు.న్యూ ఇయర్ వేడుకల వేళ ఈగల్ టీమ్ చేపడుతున్న తనిఖీలు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  

అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌‌ను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

  తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద నూతన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. కాలినడకన వచ్చే భక్తులు ఆరోగ్య భద్రత కోసం, అత్యవసర సమయాల్లో త్వరితగతిన వైద్య సేవలు  అందించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మెట్లమార్గంలో అనారోగ్యానికి గురయ్యే భక్తులు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని బీఆర్ నాయుడు సూచించారు.  టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడికల్ బృందం సేవలందిస్తుందని బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈసీజీ యంత్రం, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌, నెబ్యులైజర్‌తో పాటు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్యచౌదరీ తదితరులు పాల్గొన్నారు.

అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు  అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం మొత్తం కలియతిరిటగి అక్కడ శిల్పకళను తిలకించారు. "ఈరోజు అయోధ్యలోని దివ్యమైన, అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది.  మరోసారి ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని చంద్రబాబు ఎక్స్ ద్వారా తెలిపారు. అంతకుముందు, బాలరాముడి దర్శనార్థం అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు దేవాలయ అధికారులు, యూపీ ఎన్డీఏ నాయకులు ఘన స్వాగతం పలికారు.

సర్పంచ్‌గా గెలిచాడు...హామీలు నెరవేర్చారు

  సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామం లో ఆడ బిడ్డ జన్మిస్తే బంగారు తల్లి అనే పథకం కింద 5116/- ఇస్తానని, ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ను తుచా తప్పకుండ, హాస్పిటల్ కి వెళ్లి మరి హామీ నెరవేర్చిన సన్నివేశం మహబూబాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రి మిట్ట శివారు బందలగడ్డ కు చెందిన బానోతు గణేష్ భార్య సింధు ఆడ శిశువుకు జన్మనివ్వగా రూ. 5116 కానుక ఇచ్చి సర్పంచ్ పున్నమి చందర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆడబిడ్డ జన్మిస్తే రూ. 5116 ఇస్తానని హామీ ఇచ్చిన పున్నం చందర్ మర్రిమిట్ట గ్రామ పరిధిలోని బందల గడ్డ తండాకు చెందిన బానోతు సింధు బంగారు తల్లి జన్మించినట్లు తెలుసుకున్న సర్పంచ్ మానుకోటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి చిట్టి తల్లికి రూ. 5116 చేతికి అందించారు. గ్రామం లో ఎవరైనా చనిపోతే టెంట్, కుర్చీలు అంటూ ఖర్చు కాకుండా... వాటి ఖర్చు కూడా సర్పంచ్ గా గెలిచాక... తానే భరిస్తా అన్నారు. ఇటీవల గ్రామం లో ఒకరు మరణించగా... ఇచ్చిన హామీ ప్రకారం టెంట్, కుర్చీలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో లో 10 హామీలు... రెండు అమలు * ​గ్రామ పంచాయితీ పరిధిలోని ఏ కుటుంబంలోనైనా జరిగే (ఆడ, మగ) పెళ్ళికి డి.జె. ఉచితంగా పెడతాను...... * ​గ్రామ పంచాయితీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా బంగారు తల్లి (ఆడపిల్ల) జన్మిస్తే 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా చావుకు కుర్చీలు మరియు టెంట్ ఉచితంగా పెడతాను. * ​గెలిచిన నెల లోపు గ్రామ పంచాయితీలో గ్రామానికి సంబంధించిన గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో బస్తీ దవాఖానా మరియు గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తాను....... * ​గ్రామ పంచాయితీ పరిధిలో అండర్ డ్రైనేజీలతో కూడిన సి.సి రోడ్లు పూర్తి చేసి స్వచ్ఛ గ్రామంగా ఏర్పాటు చేస్తాను........ * ​గ్రామ పంచాయితీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతి ఒక్కరికి లేబర్ కార్డ్స్ చేపిస్తాను. * ​మన గ్రామపంచాయితీ (బందాలగడ్డ, మర్రిమిట్ట, దస్రుతండ) ఇంటిపన్ను బిల్లులను మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నాను. * ​మన మర్రిమిట్ట గ్రామపంచాయితీ శ్మశానవాటికకు కరెంటు మరియు నీళ్ళ సరఫరా చేయించగలనని హామీ ఇస్తున్నాను పున్నం చందర్ సర్పంచ్ మర్రిమిట్ట తెలిపారు.

సిగాచీ పరిశ్రమ సీఈఓ అరెస్ట్

  సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 58 మంది కార్మికులు మృతి చెందటంతో పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.సిగాచీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో స్పష్టం చేసింది.  అయితే ఈ కేసులో ఇప్పటికీ బాధ్యులను గుర్తించకపోవడంపై గత నెలలో తెలంగాణ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులను ఎందుకు గుర్తించలేకపోయారని మండిపడిన కోర్టు, దీనిపై ఏఏజీ పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. మరోవైపు, న్యాయం కోసం బాధిత కుటుంబాలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు తమకు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు పదోన్నతి

  ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గెజిట్ విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన అధికారుల్లో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా జరిగే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతి పొందినప్పటికీ కొందరు అధికారులు తమ ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతారు.  డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా పునర్వ్యవస్థీకరించారు. గంధం చంద్రుడికి కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించగా, ఇప్పటివరకు ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించగా, ఆయనకు సంబంధించిన పోస్టింగ్‌పై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.

అరకులో పర్యాటకుల రద్దీ...భారీగా ట్రాఫిక్

  భూతల స్వర్గం అరకు.. అల్లూరి జిల్లా పర్యాటకులతో నిండిపోయింది. వరుస సెలవులతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు రావడంతో నిన్న రాత్రి నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచింది. హొటల్ గదులు ఫుల్ అయ్యాయి. ఆదివారం కావడంతో అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలకు టూరిస్టుల తాకిడంతో ఉడెన్ బ్రిడ్జి వద్ద పెరిగిన రద్దీ పెరిగింది. చల్లని వాతావరణాన్ని ఆహ్లాదించేందుకు… టూరిస్టులు వస్తున్నారు. దట్టమైన పొగమంచు అందాలను కెమెరాలను బంధిస్తున్నారు. విశాఖ, అరకు, పాడేరుల్లో హోటల్స్ కి తెగ డిమాండ్ పెరిగింది.బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ, మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, చాపరాయి గెడ్డ, పాడేరు కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, కొత్తపల్లి జలపాతం, లంబసింగి ప్రాంతాల్లో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంది.  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి నుంచి పర్యాటకులు పోటెత్తిరావడంతో రద్దీ నెలకొంది. శనివారం రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు కూడా భారీగా పర్యటకులు సందర్శించే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.  

జీహెచ్‌ఎంసీ విభజన...కమిషనరేట్‌లో కీలక మార్పులు

  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధి పునర్వి భజన నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలకమైన, దీర్ఘకాల ప్రభావం చూపే నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, అంతర్జాతీయ విమానా శ్రయం, ఐటీ కారిడార్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అనే మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్‌లలో భారీ స్థాయి రీ–షఫ్లింగ్ చేపట్టనున్నారు.ఈ మార్పుల్లో భాగంగా మూడు కమిషనరేట్‌లను మొత్తం 12 జోన్‌లుగా విభజిస్తూ, జోన్‌ల సరిహ ద్దులు, అధికార పరిధులను పూర్తిగా పునర్‌వ్యవస్థీక రించారు. ఈ నిర్ణయాలతో పోలీసింగ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా, వేగంగా పని చేసేలా మారనుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. 12 జోన్‌లుగా మూడు కమిషనరేట్‌లు పోలీస్ శాఖ తాజా ప్రణాళిక ప్రకారం –హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్‌లు,సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 జోన్‌లు,రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు. నగర పరిధిలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నియంత్రణలో స్పష్టత తీసుకురావడమే ఈ పునర్విభజన లక్ష్యమని అధికారులు పేర్కొంటు న్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో కీలకమైన మార్పులు ఈ రీ–షఫ్లింగ్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకున్నది. ఇప్పటివరకు సైబరాబాద్ పరిధిలో ఉన్న శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్‌లను హైదరాబాద్ కమిషనరేట్‌లో విలీనం చేయనున్నారు.దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి రానుంది. విమానాశ్రయ భద్రత, వీఐపీ కదలికలు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పోలీసింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ మార్పు ఉపయోగప డుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని జోన్‌లు: చార్మినార్ జోన్ గోల్కొండ జోన్ ఖైరతాబాద్ జోన్ రాజేంద్రనగర్ జోన్ సికింద్రాబాద్ జోన్ శంషాబాద్ జోన్ పాత నగరం నుంచి కొత్త నగరం, విమానాశ్రయం వరకు ఒకే కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసింగ్ ఉండటం వల్ల సమన్వయం మరింత మెరుగవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.సైబరాబాద్ కమిషనరేట్‌లో విస్తృత రీ–అలైన్‌మెంట్ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన సైబరాబాద్ కమిషనరేట్‌లో కూడా భారీ మార్పులు చోటుచేసుకో నున్నాయి. శేరిలింగంపల్లి జోన్ పరిధిని మొయినాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు విస్తరించనున్నారు. దీంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాంతాల్లో పోలీస్ నిఘా మరింత బలోపేతం కానుంది. అలాగే కూకట్పల్లి జోన్ పరిధిలోకి మాదాపూర్ ప్రాంతాన్ని చేర్చనున్నారు. కుత్బుల్లాపూర్ జోన్ యథాతథంగా కొనసాగనుంది. ఐటీ ఉద్యోగులు, బహుళజాతి కంపెనీలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేరాల నియం త్రణకు ఈ పునర్విభజన ఉపయోగపడుతుందని పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో మూడు జోన్‌లు రాచకొండ కమిషనరేట్‌లో ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని కొనసాగిస్తూ మూడు జోన్‌లుగా విభజన కొనసాగనుంది. అవి ఎల్‌బీ నగర్ జోన్ మల్కాజిగిరి జోన్ ఉప్పల్ జోన్ ఈ జోన్‌ల పరిధిలో పెరుగుతున్న నివాస కాలనీలు, అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’పై కసరత్తు పోలీస్ శాఖ మరో కీలక భవిష్యత్ నిర్ణయంపై కూడా దృష్టి సారించింది.మహేశ్వరం జోన్, షాద్‌నగర్, చేవెళ్ల ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమలు, ఐటీ పార్కులు, భారీ నివాస ప్రాజెక్టులు ఏర్పడనున్న ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికతో పోలీసింగ్ వ్యవస్థను సిద్ధం చేయాలన్నదే ఈ ప్రతిపాదన ఉద్దేశం...అదే విధంగా యాదాద్రి జిల్లాను ప్రత్యేక పోలీస్ జిల్లాగా మార్చి, ఎస్పీ స్థాయి అధికారితో పోలీస్ పరిపాలన నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. శాంతిభద్రతల పటిష్టతే లక్ష్యం నగర విస్తరణకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడం, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం, నేరాల నియంత్రణలో సమర్థత పెంచడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించిన అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఎన్టీఆర్ ట్రస్ట్‌ మొక్క నుంచి వృక్షంగా ఎదిగింది : సీఎం చంద్రబాబు

  నిరుపేద, అనాథ పిల్లలకు ఉన్నత విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్‌ను స్థాపించామని సీఎం చంద్రబాబు అన్నారు.  హైదరాబాద్‌ గండిపేటలోని ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి సమర్ధవంతంగా నడిపిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తన కంటే ముందున్నారని, తాను పేపర్ చూసి స్పీచ్ ఇస్తుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారని చంద్రబాబు చమత్కరించారు.   తన చిన్నతనంలో చాలా మంది  ఐఏఎస్ చదవాలని కోరారని కానీ నేను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాయని తెలిపారు. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న క్లాస్ రూముల్లో.. అప్పట్లో పొలిటికల్ లీడర్స్ శిక్షణ తీసుకున్నారని గుర్తుచేశారు. పది ఎకరాలు ఉన్న ఈ క్యాంపస్.. అప్పుడు ఒక చిన్న మొక్కలా ఉందని.. ఇప్పుడు పెద్ద వృక్షంలాగా మారిందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్‌లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని కీర్తించారు. కొంతమంది విద్యార్థులు గ్రూప్ వన్ పాస్ అయ్యారని.. మరి కొంతమంది దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు తెచ్చుకున్నారని  తెలిపారు.1995లో తాను మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో ఐటీని ప్రారంభించానని గుర్తుచేశారు.  ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్‌తో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్‌ను ప్రారంభించామని.. ఇప్పుడు వందల కాలేజ్‌లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ వచ్చి చదువుకుంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఫ్యాక్షన్ గొడవలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాల్లోని పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండేలా ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించామని సీఎం తెలిపారు. యూనివర్శిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను... రెండేళ్లల్లో మంత్రిని అయ్యాను చంద్రబాబు పేర్కొన్నారు.  నేను రాజకీయాల్లో బిజీ అయ్యాక... హెరిటేజ్ బాధ్యతలు చూడాలని భువనేశ్వరిని కోరాను.    అయిష్టంగా హెరిటెజ్ బాధ్యతలు తీసుకున్న భువనేశ్వరి ఆ సంస్థను అద్భుతంగా అభివృద్ధి చేశారని చంద్రబాబు ప్రశంసించారు.  పట్టుదలతో హెరిటెజ్ సంస్థను నడిపించారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరిగా భువనేశ్వరికి పట్టుదల ఉంది... మొండితనమూ ఉందన్నారు. భువనేశ్వరి ఏదైనా చేయాలని సంకల్పం తీసుకుంటే పట్టుదలతో చేస్తారు. భార్యగా, తల్లిగా, గృహిణిగా, ట్రస్టీగా, హెరిటెజ్ ఎండీగా భువనేశ్వరి చాలా విజయాలు సాధించారని పేర్కొన్నారు. నేను సీఎంగా, పార్టీ అధ్యక్షునిగా పని చేస్తున్నాను... కానీ భువనేశ్వరి చాలా పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. భువనేశ్వరి చేస్తున్న కృషికి లండన్ లో ఇన్సిటిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ రెండు అవార్డులు ఇచ్చింది.    వ్యక్తిగత అవార్డు తోపాటు... హెరిటెజ్ సంస్థను అద్భుతంగా నడిపిస్తున్నందుకు గోల్డెన్ పీకాక్ అవార్డు ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల తయారీ, డ్రోన్, స్పేస్ టెక్నాలజీలకు ఏపీని హబ్‌గా తీర్చిదిద్దుతాం" అని తన భవిష్యత్ ప్రణాళికను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు..

స్పా సెంటర్‌ ముసుగులో వ్య‌భిచారం...ఇద్దరు యువతుల అరెస్ట్

  స్పా సెంట‌ర్  ముసుగులో వ్య‌భిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారమందుకున్న బద్వేలు అర్బన్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి స్పా సెంటర్ పై దాడి చేసి ఇద్దరు యువతుల తోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని నెల్లూరు రోడ్ బైపాస్ సర్కిల్ వద్ద గత ఏడాదిగా స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు.  స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు బద్వేలు అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలసి అర్ధరాత్రి తర్వాత స్పాసెంట‌ర్‌పై దాడి చేసి, అక్కడవున్న ఇద్ద‌రు యువ‌తులుతోపాటు,ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగాపోలీసులు అదుపులోకి తీసుకున్న యువ‌తుల‌ను మ‌హిళా సంర‌క్ష‌ణ కేంద్రానికి త‌ర‌లించి,కేసు న‌మోదు చేసుకుని  దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ నుంచి యువతులను బద్వేల్‌కు రప్పించి నాలుగు నెలలుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణ పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.