హింసాకాండే జగన్ పార్టీ రాజకీయ వ్యూహమా?
posted on Feb 27, 2023 @ 11:32AM
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వ్యూహాలు శాంతిభద్రతల విఘాతమే లక్ష్యంగా సాగుతున్నాయా? హింసాకాండనే అధికార పార్టీ తన వ్యూహంగా అమలు చేస్తోందా? ప్రజలలో భయాందోళనలను సృష్టించి.. వారు ఓటింగ్ కు, విపక్షాల సభలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంచే వ్యూహాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేస్తోందా? అంటే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తే ఔననే సమాధానమే వస్తుందని అనిపించక మానదు.
ఏపీలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న రాజకీయ హింసాకాండను గమనిస్తే.. అధికార పార్టీ వ్యూహాత్మకంగానే ఈ దిశగా పరిణామాలు చోటు చేసుకునే విధంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు అడుగుడుగునా అడ్డంకులు సృష్టించడం వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి, ఆ నెపంతో విపక్షాల మెబిలిటీని పరిమితం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ అడుగులు వేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మీడియా ముఖంగానే పలువురు విపక్ష నేత చంద్రబాబు పేరెత్తితేనే కొడుతున్నారంటూ వ్యక్తం చేస్తున్న ఆవేదనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
మొత్తం మీద విపక్షాలను ఏదో విధంగా రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణం సృష్టించడమే ధ్యేయంగా అధికార పార్టీ పావులు కదుపుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న భావన వ్యాప్తి చెందకుండా ఉండే వ్యూహంతోనే జనంలో భయాందోళనలను కలిగించే స్థాయిలో హింసాకాండ చెలరేగే వ్యూహంతో జగన్ పార్టీ అడుగులు వేస్తున్నదని అంటున్నారు. అధికార పార్టీ వ్యూహంలో పోలీసులు సమిధలుగా మారుతున్నారని కూడా వారు విశ్లేషిస్తున్నారు.
పై నుంచి వచ్చిన ఆదేశాలను పాటించక తప్పని పరిస్థితి కారణంగా వారు సైతం విపక్షాల విమర్శలకు కేంద్ర బిందువులుగా మారారని చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను హింసాకాండ ద్వారా నియంత్రించాలని భావించడం ఏ విధంగా చూసినా సరైనది కాదనీ, ఇది ప్రమాదకరమనీ రాజకీయ పండితులు అంటున్నారు.