చలాన్లు పడ్డ వెంటనే అకౌంట్ నుండి డబ్బులు కట్ కావాలి : సీఎం రేవంత్‌

 

ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు కీలక సూచన చేశారు. వాహన చలానా పడితే ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా టెక్నాలజీ వాడండి అని ముఖ్యమంత్రి తెలిపారు.హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేడియంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలని తెలిపారు. చలాన్లు విధించడం కాదు, ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

చలాన్లు విధిస్తే డిస్కౌంట్ ఇవ్వవద్దని సూచించారు. మైనర్లు ప్రమాదాలకు కారకులైతే వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, డ్రంగ్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించి నివారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణకు అవసరమైన ప్రణాళికను చేపట్టిన పోలీస్ శాఖను అభినందిస్తున్నాని తెలిపారు.  

దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. విద్యార్థి దశలోనే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నామని... ఆధునిక సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. అందుకే సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది.. యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. 

రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని..సైబర్ క్రైమ్, డ్రగ్స్, హత్యల కంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అతి పెద్ద సమస్యగా మారాయిని తెలిపారు.  సిగ్నల్, ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కల్పించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్ఫష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణను టాప్ ప్రయారిటీగా తీసుకుని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్

  దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట లభించింది.  డెలివరీ బాయ్స్ డిమాండ్ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. 10 నిమిషాల్లోనే డెలివరీ అంటూ ప్రకటనలు ఇవ్వొద్దని బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్ధలకు కేంద్రం సూచించింది.  కాగా  10 నిమిషాల నిబంధనను ఎత్తివేయాలంటూ కొత్త ఏడాదికి ముందు గిగ్ వర్కర్లు నిరసన చేపట్టారు.డెలివరీ బాయ్స్ తమ ప్రాణాలను పణంగా  ఆన్లైన్ డెలివరీ చేస్తున్నామని కానీ దానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని యూనియన్లు గతంలో ఆందోళన నిర్వహించాయి. 10 నిమిషాల్లో డెలివరీ చేయమని కోరడం అన్యాయం. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది" అని ఐఎఫ్ఏటి ప్రతినిధులు పేర్కొన్నారు. రైడ్-హెయిలింగ్ డ్రైవర్లకు కిలోమీటరుకు కనీసం రూ. 20 చెల్లించాలని రోజుకు 8 గంటల పనివేళలు ఉండాలి. అదనపు సమయం పనిచేస్తే 'ఓవర్‌టైమ్' కింద అదనపు వేతనం ఇవ్వాలని గిగ్ వర్కర్ల డిమాండ్ చేశాయి. ప్రమాదాలు, అనారోగ్యం సంభవించినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలి.తమ కష్టానికి తగిన విలువ ఇవ్వాలని, రోడ్లపై ప్రాణాలకు భరోసా కల్పించాలని గిగ్ వర్కర్లు గట్టిగా కోరుతున్నారు.   

ఉత్తర భారతాన్ని గజగజలాడిస్తున్న చలి పులి... మైనస్ డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

ఉత్తర భారతాన్ని చలి పులి గజగజలాడిస్తోంది. పలు ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు తక్కువగా  ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఢిల్లీలో మంగళవారం (జనవరి 13) అత్యల్పంగా 2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  ఈ శీతాకాలంలో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత.  ఇక గాలిలో తేమ శాతం వంద శాతానికి చేరింది. ఇక పంజాబ్, హర్యానాలు కూడా తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగ మంచుతో అల్లల్లాడుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.  ఉత్తరాదిలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి.  పంజాబ్‌లోని భటిండాలో 0.6 డిగ్రీలు, అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లలో ఒక డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోయింది. అయితే గురుగ్రామ్ శివారు ప్రాంతాలలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయిందని వాతావరణ శాఖ పేర్కొంది.  కాగా  రాజస్థాన్‌లోని  ఫతేపూర్ శేఖావతిలో  మైనస్ 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి స్వగ్రామం  నారావారిపల్లెలో  మంగళవారం (జనవరి 13) సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణి, ఇంకా నందమూరి కుటుంబ సభ్యులు గ్రామం అంతా కలియదిరుగుతూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.   నారావారి పల్లెలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు.  ముగ్గులు పోటీలు, క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. అలాగే  ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని  సన్మానించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు.    ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి  భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా రూ. 10,116 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. 

గాదె ఇన్నయ్య నివాసం, ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు

మావోయిస్టులతో సంబంధాలు, వారికి సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేసిన సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, ఆయన నిర్వహిస్తున్న మా ఇల్లు ఆశ్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మంగళవారం (జనవరి 13) సోదాలు నిర్వహించారు.  కుషాయిగూడ పరిధిలోని చక్రిపురంలోని  సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, జనగామలో ఆయన నిర్వహి స్తున్న అనాథాశ్రమంలో నిర్వహించిన తనిఖీలలో కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  మావోయిస్టులకు నిధుల సేకరణ, మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ మెంట్లు చేయడంతో పాటుగా ,  సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో గాదె ఇన్నయ్యను కొంత కాలం కిందట ఎన్ఐఏ అరెస్టు చేసింది.  ఇప్పుడు తాజాగా ఆయన నివాసాలలో సోదాలు నిర్వహించింది.  మంగళవారం (జనవరి 13) తెల్లవారు జామునే గాదె ఇన్నయ్య ఇంటిని చుట్టుముట్టి ఆయన  డైరీలు, ఫోన్ కాల్ డేటా, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పరిశీలించారు. ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు? ఆశ్రమానికి వస్తున్న నిధుల మూలాలు ఏమిటి? అనే కోణంలో అధికారులు ఆరా తీశారు.  సోదాల అనంతరం కొన్ని కీలక పత్రాలు, పెన్ డ్రైవ్‌లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.    ఇలా ఉండగా గాదె ఇన్నయ్యను ఐదు రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు తీర్పును ఈ నెల 16కు వాయిదా వేసింది.  కోర్టు తీర్పు వెలువడక ముందే అధికారులు  సోదాలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది.

గోదావరి జిల్లాల్లో విహంగ వీక్షణం.. సంక్రాంతి స్పెషల్ హెలికాప్టర్ రైడ్

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. అసలు సంక్రాంతి సంబరాలు చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే అని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు భావిస్తుంటారు. అటువంటి గోదావరి జిల్లాలో  ఈ సారి సంక్రాంతి సందడి మరో లెవెల్ కు చేరేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. గోదావరి అందాలను, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది సంగమ స్థలిలి, అలాగే కోనసీమ కొబ్బరి చెట్ల సోయగాలను విహంగ వీక్షణం చేసే అవకాశం కల్పిస్తున్నది.  హైదరాబాద్‌కు చెందిన విహాగ్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌   ఉభయ తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పండుగ కోసం తరలివచ్చే ప్రయాణీకులకు హెలికాప్టర్ రైడ్ ద్వారా గోదావరి అందాలు వీక్షించే అవకాశం కల్పిస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా పండుగ  మూడు రోజులూ ఈ హెలికాప్టర్ రైడ్ అందుబాటులో ఉంటుంది. పాతిక నిముషాల సేపు సాగే ఈ రెడ్ కోసం మనిషికి ఐదు వేల రూపాయలుగా ధర నిర్ణయించారు.  పశ్చిమగోదావరి జిల్లా న  సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుండి హెలికాప్టర్ రైడ్‌ ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి పాతిక నిముషాల పాటు ఉండే ఈ హెలికాప్టర్ రైడ్ లో అంతర్వేది ఆలయం, సముద్రం, గోదావరి కలిసే సంగమ స్థలం, అలాగే గోదావరి పాయలు కలిసే అన్నా చెళ్లెల్ల గట్టు, కోనసీమ కొబ్బరి తోటల అందాలు వీక్షించవచ్చు.  

ఉద్యోగులు, పెన్షనర్లకు బాబు సర్కార్ సంక్రాంతి గిఫ్ట్

పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ బహుమతి ప్రకటించింది. దీర్ఘ కాలంగా ఉన్న బకాయిలను చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి పడిన 2, 653 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధుల విడుదల కు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఉత్తర్వులతో ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు   మౌలిక సదుపాయాల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు  కూడా ఉపశమనం లభిస్తుంది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మంది ఉద్యోగులు , పెన్షనర్లకు   లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ గ్రీన్ సిటీ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గౌడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ లో భారీగా ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువైంది. ప్లాస్టిక్ కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతం అంతా కమ్ముకున్నాయి. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్లాస్టిక్ కాలి పొగ వ్యాపించడంతో స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.   సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  ప్రమాద కారణాలు వెంటనే తెలియరాక పోయినప్పటికీ,  షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా భావిస్తున్నారు.  ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది. 

సామ్రాజ్యవాద విస్తరణ.. అమెరికా పెడధోరణులపై ప్రపంచ దేశాల ఆగ్రహం

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విపరీత పోకడలు పోతున్నారు. తాను ఒక్క అమెరికాకే కాదనీ, ప్రపంచదేశాలకూ అధినేతనేనన్న అహంకారంతో విర్రవీగుతున్నట్లు కనిపిస్తున్నది. సామ్రాజ్యవాద, ఆక్రమణ  ధోరణులను  ఇష్టారీతిగా ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇప్పుడాయన చూపు గ్రీన్ ల్యాండ్ పై పడింది. ఇప్పటికే వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనని తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్  ఇక గ్రీన్ ల్యాండ్ కు కూడా తానే అధిపతిని అని ప్రకటించడానికి రెడీ అయిపోతున్నారు.   ఇది మన్రో సిద్ధాంతానికి అనుగుణంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం  రెండు అమెరికా ఖండాల పై ఏ దేశం కూడా తమ వలసలను విస్తరించడానికి అనుమతించబోదు. ఈ సిద్ధాంతాన్ని  1823లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మన్రో ప్రకటించి అమలు చేశారు. కాలం చెల్లిన ఆ సిద్ధాంతాన్నే ఇప్పుడు ట్రంప్ మన్రో సిద్దాంతం కాదు.. టన్రో  సిద్దాంతం అంటూ ఆక్రమణ కు తెరతీశారు.  గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించి తీరుతామని ట్రంప్ చేసిన ప్రకటనపై  డెన్మార్క్,గ్రీన్ ల్యాండ్ లు రగిలిపోతున్నాయి. డెన్మార్క్ ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ఇప్పుడు డెన్మార్ పాక్షిక ఏలుబడిలో ఉంది.   ఇలా ఉండగా అమెరికా తాటాకు చప్పుళ్లకు బెదరమని, పోరాటానికి సిద్ధమని గ్రీన్ లాండ్ తెగేసి చెప్పింది.  తాముగ్రీన్ లాండర్లు..డానిష్ పౌరులుగా నే  కొనసాగుతామని కుండబద్దలు కొట్టేసింది.   అది పక్కన పెడితే నాటో కూటమి లో భాగమైన డెన్మార్క్ అమెరికా దాడిచేస్తే నాటో నాశనం ఖాయమని తేల్చిచెప్పింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన రక్షణ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని హెచ్చరించింది. 500 ఏళ్లుగా డెన్మార్క్ గ్రీన్ లాండ్ లు కలిసి ఉంటున్నాయి. అయితే అంత మాత్రాన గ్రీన్ లాండ్ డెన్మార్క్ భూ భాగం ఎలా అవుతుందని ట్రంప్ అంటున్నారు.   అమెరికా రక్షణ కోసం తమకు గ్రీన్ ల్యాండ్ అవసరమని ట్రంప్ చెబుతున్నారు.  ట్రంప్ ఏం చెప్పినా ఆయా దేశాలలోని సహజ వనరులపై గుత్తాధిపత్యం కోసమే అమెరికా తన సామ్రాజ్య విస్తరణకు మన్రో, టన్రో అంటూ కొత్త కొత్త పేర్లు, ఎత్తుగడలతో సాగుతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు.  ప్రచ్ఛన్న యుద్ధం తరువాత సోవియట్ పతనంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యం గా ఆవిర్భవించింది. ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు  పుతిన్ వ్యూహాత్మక అడుగుల కారణంగా రష్యా కూడా శక్తిమంతమైన దేశంగా ఏర్పడింది. అలాగే బలీయమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ఇప్పుడు రష్యా, చైనాలు కలిస్తే.. తన ఆధిపత్యానికి గండి పడటం ఖాయమన్న భయంతోనే అమెరికా అడ్డగోలుగా దేశాలలో అశాంతిని రగిల్చి ఆక్రమణల బాట పట్టిందంటున్నారు.  అత్యధిక వనరులున్న ప్రాంతాలను, దేశాలను  కైవసం చేసుకుని తిరుగులేని శక్తి అమెరికా అని చాటాలని చూస్తోంది. అయితే అమెరికా, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ధోరణులను ప్రపంచదేశాలు గర్హిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే అమెరికాకు పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో పలు జిల్లాలకు కొత్త జేసీలు.. ఐఏఎస్ ల బదలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు  కొత్త జాయింట్ కలెక్టర్లను  నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా కొత్త జేసీలు నియమితులైన జిల్లాలలో  ఇటీవలే కొత్తగా ఏర్పాటైన   మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులును మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే  చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గొబ్బిళ్ల విధ్యాధరిని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గానూ, అన్నమయ్య జిల్లా జేసీగా ఉన్న ఆదర్శ రాజేంద్రన్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కార్యదర్శిగా పని చేస్తున్న గోవిందరావును  టుడా  వైస్ చైర్మన్‌గా నియమించింది. ఆయనకు తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు.   పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజన సింహాను ప్రభుత్వం నియమించింది.   రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్‌కు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. 

లక్ష వీసాలు రద్దు.. అమెరికా సంచలన నిర్ణయం

దేశ భద్రతకు ప్రథమ తాంబూలం అన్న విధానంలో భాగంగానే ట్రంప్ సర్కార్ కఠినాతి కఠినమైన వలస విధానాలను అనుసరిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.   అమెరికా పౌరుల భద్రత, దేశ సార్వభౌమత్వ పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది.  జాతీయ,   ప్రజా భద్రతకు ముప్పు కలిగించే విదేశీయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ.. రద్దు చేసిన వీసాలలో 8 వేలవిద్యార్థి వీసాలు ఉన్నట్లు తెలిపింది. అలాగే స్పెషల్ టాలెంట్ వీసాలు పాతిక వందలు ఉన్నాయని వివరించింది.   వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, దాడులు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడటం వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.  అమెరికాలో ఉంటున్న విదేశీయులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండేలా  కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్ అనే కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపిన అమెరికా విదేశాంగ శాఖ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.