హైడ్రా అంటే కూలగొట్టడానికే కాదు...ప్రభుత్వం, ప్రజల ఆస్తులను రక్షించేది : సీఎం రేవంత్
posted on May 8, 2025 @ 6:52PM
హైదరాబాద్ బుద్ధభవన్‌లో హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయి అక్కడ ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు సైతం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఢిల్లీలో పాటు దేశంలోని అనేక మెట్రో పాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు ఉన్నాయని.. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు . హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది.. ఇది ప్రజలు గుర్తించాలని అన్నారు.
చిన్న వర్షం పడితే హైదరాబాద్ నగరం మొత్తం అల్లకల్లోలం అవుతుంది.. ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి ఉండదు.. కాలనీలన్నీ చెరువులను తలపిస్తాయని గుర్తుచేశారు. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా హైడ్రా శరవేగంగా పని చేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల రక్షణలోనే కాదు విపత్తుల నిర్వహణలోనూ హైడ్రా విశేషంగా కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ స్టేషన్‌లో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు.