అరెస్టు గురించి ఆలోచించడం లేదు:వైఎస్ జగన్
posted on Feb 23, 2012 @ 11:20AM
హైదరాబాద్: తాను తన అరెస్టు గురించి ఆలోచించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వర్గం శాసనసభ్యులతో అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి మరికొద్ది రోజుల్లో జగన్ అరెస్టు అవుతారని ప్రచారం చేస్తున్నాయని పలువురు జగన్ ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తీసుకు వెళ్లగా, అందుకు స్పందించిన జగన్.. తాను అరెస్టు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, వారు ఏమైనా అనుకోనివ్వమని, నేను మాత్రం నా అజెండాతో ముందుకెళతానని, ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే నా తల్లి విజయలక్ష్మి పార్టీ వ్యవహారాలు చూసుకుంటుందని వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా జగన్ వర్గం శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ గురువారం స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరుకుంటున్నారని అలాగే తాము జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని ఆయన చెప్పారు.