మద్యం సిండికేట్లపై దేవేందర్ గౌడ్ మండిపాటు
posted on Dec 19, 2011 @ 4:14PM
హైదరాబాద్: మద్యం సిండికేట్లపై ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసమ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత టి.దేవేందర్ గౌడ్ అన్నారు. ఆబ్కారీ విధానంలో మార్పు తీసుకుని వస్తే సిండికేట్ల వ్యవహారాలు కట్టడి అవుతాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మద్యం సిండికేట్లపై, గ్రూప్ - 1 మెయిన్స్ ఫలితాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మద్యం సిండికేట్ల వ్యవహారానికి ప్రజా ప్రతినిధులే కారణమని ఆయన విమర్శించారు. మద్యం ద్వారా అధిక ఆదాయాన్ని రాబట్టేందుకు సిండికేట్లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. ఆబ్కారీ విధానంలో మార్పు కోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మద్యం సిండికేట్లలోని ప్రజాప్రతినిధుల పేర్లను వెల్లడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని ఈ నెల 21వ తేదీన రాష్ట్రంలోని అన్ని ఆబ్కారీ పోలీసు స్టేషన్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. లిక్కర్ మాఫియాలో ఉన్న పెద్ద మనుషుల పేర్లను తక్షణమే బయటపెట్టాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. దీని వెనక ఏ మతలబు లేకపోతే సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు. గ్రూప్ వన్ ఫలితాల్లో ముఖ్యమంత్రి హస్తం ఉందనే అనుమానం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోందని, తనకు కూడా ఆ అనుమానం ఉందని ఆయన అన్నారు. వెంటనే ఆ పరీక్షను రద్దు చేసి, మరోసారి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.