భయపెడుతున్న హుస్సేన్ సాగర్..!
posted on Oct 26, 2013 @ 11:17AM
హైదరాబాద్ సికింద్రాబాద్ లను కలుపుతూ హైదరాబాద్ కు తలమానికంగా ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు ప్రమాదం అంచున ఉంది. చాలా ఏళ్ల తరవాత మరో సారి ఈ పరిస్థితి తలెత్తిందది. 2000 సంవత్సరానికి ముందు వచ్చిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయికి చేరింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలయిన గాంధీనగర్, అశోక్ నగర్, సుందరయ్య విజ్ఞానకేంద్రం పరిసరాలను వరదనీరు ముంచెత్తింది. హుస్సేన్ సాగర్ తెగుతుందా? అన్న స్థాయికి చేరింది.
ఇప్పుడు దాదాపుగా ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. సాగర్ గరిష్ఠ నీటి మట్టం 513.51 అడుగులు కాగా ప్రస్తుతం 513.25 అడుగులకు చేరుకుంది. నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడి కక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఇప్పుడు హుసేస్ సాగర్ పూర్తిస్థాయి మట్టానికి చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.