Read more!

కష్టసమయాల్లో పాటించాల్సిన ఐదు నియమాలు ఇవే!

కొందరు సమస్యలకు అంతగా టెన్షన్ పడరు. తేలికగా తీసుకుని పరిష్కరించుకుంటారు. కొందరైతే భయాందోళనకు గురవుతారు. ప్రతివ్యక్తి జీవితంలో ఏదొక సమయంలో కష్టాలను ఎదుర్కొవల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమవుతాడు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా భావిస్తుంటారు. అలాంటివారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి:

ఏవ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు..అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఎందుకంటే మీరు సంక్షోభం నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉన్నట్లయితే..ఆ సమస్య నుంచి తేలికగా బయటపడతారు.

ముందుగానే సిద్ధంగా ఉండాలి:

ఆచార్య చాణక్యుడు తెలిపిన ప్రకారం..ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు చుట్టిముట్టినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుందని ముందే ఊహించాలి. అందుకు తగ్గట్లుగానే సిద్ధపడాలి. సమస్య నుంచి పారిపోవడం కంటేనూ దానిని ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.

ఓపిక పట్టాలి:

చాణక్య విధానం ప్రకారం...ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనంకోల్పోకూడదు. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకూడదు. మీకు మంచి రోజులు వచ్చేంత వరకు ప్రశాంతంగా వేచి ఉండాలి.

కుటుంబ సభ్యులతో బాధ్యతగా:

చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కూడా వ్యక్తి మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోవాలి.

డబ్బు ఆదా చేయాలి:

ఎప్పుడూ డబ్బు ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.