మీకు గుడ్లు తినడం అలవాటు లేదా? గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు తినండి..!
posted on Sep 1, 2025 @ 11:36AM
గుడ్లను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరు గుడ్లు తినడానికి అనువుగా ఉంటాయి. ముఖ్యంగా పోషకాహార లోపం రాకూడదంటే పిల్లలకు చిన్నతనం నుండే రోజుకు ఒక గుడ్డు తప్పనిసరిగా ఇవ్వడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. పైగా గుడ్లతో బోలెడు రుచికరమైన వంటలు తయారు చేస్తుంటారు. కానీ అందరూ గుడ్లను తినలేరు. భారతదేశంలో శాకాహార ఆహారాన్ని అనుసరించేవారు కూడా ఉన్నారు. కనీసం గుడ్డును కూడా తినని వారు ఉన్నారు. ఇలాంటి వారు ప్రోటీన్ ఫుడ్ కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాలు ఉన్నాయి. ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. అయితే ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న శాకాహార ఆహారాలు ఉన్నాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన 4 సూపర్ ఫుడ్స్ ఎంటో తెలుసుకుంటే..
శనగలు..
భారతీయుల ఆహారంలో అద్బుతం అని చెప్పదగినవి శనగలు. వీటిలో ప్రోటీన్ కంటెంట్ అమోఘం. అర కప్పు శనగలలో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. భారతీయులు అయితే శనగలను చాలా బాగా వండేస్తారు. చోలే కూర, ఉడికించిన శనగలను స్నాక్స్ గానూ, వేయించిన శనగలను టైం పాస్ గా తినడం కోసం.. ప్రోటీన్ పౌడర్ గానూ.. ఇలా చాలా రకాలుగా శనగలను తినవచ్చు.
పనీర్..
పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.అటువంటి పాల నుండి తయారయ్యే పనీర్ లో కూడా ప్రోటీన్ మెరుగ్గా ఉంటుంది. అరకప్పు కాటేజ్ జున్నులో దాదాపు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. భారతీయులు పనీర్ ను కూరల్లోనూ, శాండ్విచ్ ల తయారీ లోనూ, స్నాక్స్ గానూ, రకరకాల తినుబండారాలుగా, స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. తక్కువ కొవ్వు ఉన్న పనీర్ ను ఎంచుకుంటే మరింత ఆరోగ్యం.
బాదం..
ప్రోటీన్ కంటెంట్ను పెంచడానికి బాదం గ్రేట్గా సహాయపడుతుంది. బాదం బటర్ కూడా తయారు చేసుకుని వాడవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బాదం బటర్ లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు బాదంలో ఉంటాయి. బాదంను చాలామంది రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు. అలా కాకుండా.. బాదం ను స్నాక్స్ గానూ, బాదం బటర్ తయారు చేసుకుని, స్వీట్స్ లోనూ, ప్రోటీన్ పౌడర్ లోనూ వినియేగించవచ్చు.
గుమ్మడి గింజలు..
గుమ్మడికాయ విత్తనాలు చాలా స్పెషల్.. వీటిని ఏదైనా సలాడ్, డెజర్ట్ లేదా స్మూతీలలో ఈజీగా జోడించవచ్చు. పొట్టు తీసిన ఔన్స్ గుమ్మడి గింజలలో 8.5 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి. అవి జింక్, ఇనుము, రాగి, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం కూడా అందిస్తాయి, ఇవి వోట్మీల్, పాయసం, స్వీట్స్ స్నాక్స్ లలో జోడించుకోవచ్చు. లేదంటే నానబెట్టిన బాదంతో పాటు రోజూ గుమ్మడి గింజలను కూడా తినవచ్చు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...