ఆశ!

అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. యుద్ధంలో తలలు తెగిపడుతున్నాయి. తీవ్రంగా గాయపడినవారు జీవచ్ఛవాల్లా సైనిక ఆసుపత్రుల్లో పడి ఉన్నారు. అలాంటి ఓ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు పక్కపక్కనే ఉన్నారు. వారిలో ఒకరికి కాస్త లేచి కూర్చనేంత ఓపికైనా ఉండేది. మరొకరు మాత్రం ఆ అవకాశం కూడా లేదు. తూట్లు పడిన శరీరంతో నిస్సహాయంగా మంచం మీద పడి ఉన్నాడు.`ఈ మందులన్నీ దండుగ. నేను చచ్చిపోవడం ఖాయం. లేచి కూర్చోలేనివాడిని నా కాళ్ల మీద ఇంకెప్పటికీ నిలబడలేను కదా!`అంటూ ఏడ్చేవాడు రెండో సైనికుడు. 

`అబ్బే అదేం కాదు! నువ్వు సుబ్బరంగా లేచి తిరుగుతావు. నాదీ హామీ. అసలు నా పక్కన ఉన్న కిటికీని చూశావూ… ఈ కిటికీలోంచి కనిపించే ప్రపంచాన్ని చూస్తే రోజురోజుకీ నాలో జీవించాలన్న ఆశ పెరిగిపోతోంది` అన్నాడు మొదటి సైనికుడు.
`మరి నాకా భాగ్యం లేదు కదా! ఈ నాలుగు గోడలూ తప్ప ఉత్సాహం కలిగించేది ఏదీ నాకు కనిపించడం లేదు` అని వాపోయాడు రెండో సైనికుడు. 

`అయితే ఓ పని చేద్దాం! నేను రోజూ కిటికీలోంచి కనిపించే అందమైన ప్రపంచాన్ని నీకు వర్ణిస్తూ ఉంటాను. నువ్వు హాయిగా కళ్లు మూసుకుని వాటిని ఊహించుకో` అని సూచించాడు మొదటి సైనికుడు. 

రెండో సైనికుడికి ఈ పద్ధతి బాగుంది. మొదటి సైనికుడు రోజూ బయట ఉన్న వాతావరణాన్ని వర్ణించేవాడు. అందమైన సూర్యోదయాల గురించీ, చిగురించే చెట్ల గురించీ, చిరుజల్లుల గురించీ వర్ణించేవాడు. దూరంగా ఉన్న సరస్సునీ, దాని మీద వాలుతున్న కొంగలనీ, అందులో ఈత కొడుతున్న పిల్లలనీ వర్ణించేవాడు. ఆసుపత్రి పక్కగా వెళ్తున్న మనుషుల గురించీ, వారి హావభావాల గురించీ, కేరింతల వర్ణించేవాడు. మొదటి సైనికుడు కళ్లు మూసుకుని అవన్నీ ఊహించుకోసాగాడు. అతనిలో రోజురోజుకీ జీవించాలన్న ఆశ పెరిగిపోసాగింది. ఎలాగైనా ఆరోగ్యం బాగుపడాన్నల కోరిక బలపడింది. తను కూడా ఆ సూర్యోదయాలను చూడగలగాలి, తన పిల్లలతో తిరిగి సంతోషంగా గడపగలగాలి… అవే తన లక్ష్యాలు! 

రెండో సైనికుడి ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది. `రేపటి నుంచీ నువ్వు లేచి ఓ నాలుగు అడుగులు వేయవచ్చు` అని వైద్యులు కూడా చెప్పారు. ఆ రేపటి కోసం ఎదురుచూస్తూ హాయిగా నిద్రపోయాడు రెండో సైనికుడు. మర్నాడు ఉదయం నిద్రలేచి చూసేసరికి తన పక్కనే ఉన్న మంచం ఖాళీగా కనిపించింది. 

`ఈ మంచం మీద ఉన్న వ్యక్తి ఏమయ్యాడు` అంటూ ఆతృతగా అడిగాడు నర్సుని.
`అతను ఇవాళ తెల్లవారుజామున చనిపోయాడు` అన్న సమాధానం వినిపించింది.
తనలో ఇన్నాళ్లుగా ఆశని రేకెత్తించిన వ్యక్తి చనిపోవడం అతనికి చాలా బాధని కలిగించింది. ఆతృతగా లేచి వెళ్లి కిటికీలోంచి తొంగిచూశాడు. ఆశ్చర్యం! ఆ కిటికీకి దగ్గరలోనే మరో గోడ అడ్డంగా ఉంది. అందులోంచి అసలు సూర్యోదయం కూడా కనిపించే అవకాశం లేదు. 

`రోజూ ఈ కిటికీలోంచి చూస్తూ నా మిత్రుడు ఎన్నో దృశ్యాలను వర్ణించేవాడే` అని ఆశ్చర్యపోయాడు సైనికుడు.
`అసాధ్యం. ఎందుకంటే అతను ఈ ఆసుపత్రిలో చేరేనాటికి అతనికి చూపు లేదు!` అంది నర్సు నింపాదిగా!


- అంతర్జాలంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఓ కథకు అనువాదం.