హనీమూన్ వెళ్తే ఈ 5 తప్పులు చేయకండి.. మీ లైఫ్ ఖతం..!
posted on Nov 16, 2024 @ 9:30AM
పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం, బంధువులకు దూరంగా.. కొత్త జంట ఒకరినొకరు తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన సమయం పొందుతారు. అది ప్రేమ వివాహమైతే వేరే విషయం. కానీ పెద్దలు కుదిర్చిన వివాహమైతే భార్యాభర్తలు కలిసి గడిపేందుకు, వారు ఒకరినొకరు తెలుసుకునేందుకు ఇదే తొలి అవకాశం అవుతుంది. సాధారణంగా హనీమూన్ అనేది శారీరక సంబంధాలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. అయితే మొదటి సారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జంట మధ్య చాలా లోతైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు జరిగితే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండటానికి బదులు, కొత్త జీవితం కాస్తా కలతలకు నిలయంగా మారుతుంది. హనీమూన్ లో కొత్తజంట చేయకూడని 5 తప్పులేంటో తెలుసుకుంటే..
పెళ్లిలో జరిగిన తప్పులను ప్రస్తావించొద్దు..
పెళ్లి అన్నాక ఏవో ఒక చిన్న లోటు పాట్లు, తప్పులు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. రెండు వైపుల నుండి వాదనలు, అభిప్రాయ బేధాలు ఏర్పడి ఉండవచ్చు. కానీ హనిమూన్ కు వెళ్లినప్పుడు ఈ విషయాలను కొత్త జంట చర్చిస్తూ కూర్చోకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఏకాంతంగా గడిపి, గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాల్సిన సమయంలో జరిగిన గొడవల గురించి అస్సలు మాట్లాడొద్దు.
ఎక్స్పెక్టేషన్స్ వద్దు..
హనిమూన్ అనగానే ముందుగానే అక్కడ అలా ఉండాలి, ఆ సమయం ఇలా గడవాలి వంటి విషయాలను ముందుగానే అంచనా వేసుకోకూడదు. కేవలం హనిమూన్ ప్లాన్ మాత్రమే నిర్ణయించుకోగలుగుతారు. అక్కడికి వెళ్లిన తరువాత ఇద్దరి సహకారం మీద, అక్కడి వాతావరణం మీద మాత్రమే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందే ఏదేదో ఊహించుకుని ఆ తరువాత డిజప్పాయింట్ అవ్వకూడదు.
గతాలు వద్దూ..
ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి వద్ద నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది తమ గతం గురించి చెబుతుంటారు. గతంలో ఎవరితోనైనా ప్రేమ, వారితో రిలేషన్షిప్, స్నేహం, వారితో సన్నిహితంగా ఉన్న క్షణాలు ఇలాంటివి ప్రస్తావించకూడదు. ముందు ఏం జరిగిందో అనే విషయాలు మనసు నుండి తీసేయడం మంచిది. కొత్త భాగస్వామితో జీవితాన్ని కొత్తగా సంతోషంగా ప్రారంభించాలి.
వాదన వద్దూ..
ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరనే మాట ఎంత వాస్తవమో... ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు ఒకేలా ఉంటాయనే మాట అంతే వాస్తవం. హనీమూన్ లో ఇద్దరు వ్యక్తుుల విభిన్న ఆలోచనలు, ఇష్టాలు, నిర్ణయాలు గొడవలకు, వాదనలకు కారణం కాకూడదు. ఏదైనా అభిప్రాయ బేధం వచ్చినా అది గొడవగా మారకముందే దాన్ని ఆపేసి కాసేపు మౌనంగా ఉండటం మంచిది.
గదికే పరిమితం కావద్దు..
హనీమూన్ కోసం ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి వెళ్లి తీరా ఆక్కడికి వెళ్లాక అక్కడ కేవలం మీకు కేటాయించిన గదిలోనే ఉండిపోకూడదు. అక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతాలను, వాతావరణాన్ని, సంస్కృతిని గమనించి, అర్థం చేసుకుని, జీవితానికి వాటిని అన్వయించుకుంటే మీ జీవితంలో హనీమూన్ ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
*నిశ్శబ్ద.