దేశంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందా అని జగన్ సర్కార్ ను ప్రశ్నించిన హైకోర్టు
posted on Dec 11, 2020 @ 1:08PM
జగన్ సర్కార్ మిషన్ బిల్డ్ ఏపీ పేరుతొ నిధుల కోసం విశాఖ, గుంటూరు నగరాల్లో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై సామజిక కార్యకర్త తోట సురేష్ తో పాటు మరి కొందరు పిల్ దాఖలు చేయగా.. కొంత కాలంగా హై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనల సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం దేశంలో ఏమైనా ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందా.. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుని నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతోపాటు కరోనా కాలంలో అత్యధిక ధరకు మద్యం కొనుగోలు చేసి రాష్ట్ర సంక్షేమం కోసం పాటు పడుతున్న మందుబాబులకు ప్రభుత్వం కృతఙ్ఞతలు తెలపాలని వ్యంగ్యంగా పేర్కొంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రభుత్వం తరుఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపై స్పందించిన ధర్మాసనం మీరు ఎంత బాగా చేస్తున్నారో అందరికి తెలుసనీ పేర్కొంది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది.