ఎన్ కన్వెన్షన్‌పై చట్టాన్ని అతిక్రమించొద్దు: కోర్టు
posted on Jul 2, 2014 @ 12:09PM
సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వమైనా, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించకూడదని, చట్టపరంగానే నడుచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్పై చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వానికి తెలిపింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించామని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు కన్వెన్షన్ సెంటర్‌లోని నిర్మాణాలను మార్కింగ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్ కన్వెన్షన్ యజమాని, సినీ నటుడు అక్కినేని నాగార్జున, దాని లీజుదారు ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి విచారణ ముగించారు. సర్వే చేసేటట్లయితే ముందస్తుగా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని, ఏ చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. ప్రభుత్వం కూడా చట్టపరంగా నడుచుకోవాలని, చట్టాన్ని అతిక్రమించకూడదని స్పష్టంగా సూచించారు. అదే సమయంలో, ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమేనంటూ అడ్వకేట్ జనరల్ చేసిన వాదనను కూడా రికార్డు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.