చంద్రబాబు మధ్యంతర బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్
posted on Oct 30, 2023 @ 4:55PM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిలు పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. దీనిపై వాదనలు పూర్తయ్యీయా. తీర్పు మంగళవారం (అక్టోబర్ 31న)న వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది.
స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన చంద్రబాబు నాయుడు ఆరోగ్య కారణాల రిత్యా మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరుతూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కోర్టుకు సమర్పించారు. ఆయన వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆయన కంటికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టై 50 రోజులు దాటిందనీ, ఇంత వరకూ ఈ కేసులో కొత్తగా పురోగతి లేదనీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
కాగా ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు మంగళవారం (అక్టోబర్ 31)కు వాయిదా వేసింది. ఇలా ఉండగా.. చంద్రబాబు రెగ్యులర్ బెయిలు పిటిషన్ పై వాదనలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం తరఫు న్యాయవాది, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి సమయం కోరారు. దీంతో ఈ కేసుపై వాదనలు ఎప్పుడు వినేదీ కూడా మంగళవారం (అక్టోబర్ 31) నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. కాగా ఇదే కేసులో చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వచ్చే నెల 8వ తేదీలోగా వచ్చే అవకాశం ఉంది.