నేనెలా అనర్హుణ్ణి అవుతాను?.. హేమంత్ సొరేన్ మండిపాటు
posted on Aug 25, 2022 @ 6:10PM
ఒకరి మీద బురదజల్లి, తర్వాత వివాదాస్పదుడని ప్రచారం చేసి భ్రష్టు పట్టించడం బీజేపీవారికి అలవాటైన విద్య అని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అన్నారు. తనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించిందంటూ వెలువడిన కథనాలపై హేమంత్ సోరేన్ స్పందించారు. తనపై అనర్హత వేటుకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు. అంతకు ముందు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను సీఎం కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని హేమంత్ సొరేన్ పై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల కమిషన్ సీల్డ్ కవర్‌లో ఝార్ఖండ్ గవర్నర్ కు పంపిందనీ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లాభదాయక పదవిని నిర్వహిస్తున్నందువల్ల ఆయన్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించా లని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న గవర్నర్ కు కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం హేమంత్ సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, ముఖ్య మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. దీనిపై గవర్నర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు. దీనిపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు పంపించిందని, ఈ నివేదిక రాజ్ భవన్‌కు చేరిందంటూ వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ ఢిల్లీ పర్య టనలో ఉన్నారు.