జలదిగ్బంధంలో రాష్ట్రం

 

నీలం ప్రభావం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. గోదావరి జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి. కుండపోత వర్షం కాకినాడను ముంచేసింది. అన్ని దారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై, ఇళ్లలోకి నీరు చేరింది. నీలం తుఫాను ప్రభావం 14 జిల్లాలను అతలాకుతలం చేసింది. శారదా నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వరదకు కొట్టుకుపోయింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని గజాలాఖానా వంతెన స్వల్పంగా కుంగింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

 

జోలావుట్ రిజర్వాయర్‌కు ప్రమాద స్థాయిలో నీటిమట్టం చేరుకుంది. దీని సామర్థ్యం 2750 క్యూసెక్కులు కాగా ఇప్పటికే 2749 క్యూసెక్కుల నీరు చేరింది. అనకాపల్లి ఆర్టీసి బస్సు మోకాళ్ల లోతు నీటిలో మునిగి పోయింది. విజయవాడలో ఇంద్రకీలాద్రి రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో రాకపోకలు స్తంభించాయి. వరదలపై అధికారులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.


ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరదలపై సమీక్షించారు. కలెక్టర్లు, సిఎస్‌తో ఫోన్లో మంతనాలు జరిపారు. వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రులు పళ్లం రాజు, విశ్వరూప్, తోట నరసింహంలు, పశ్చిమ గోదావరి జిల్లాలో వట్టి వసంత్ కుమార్, పితాని సత్యనారాయణలు సమీక్షిస్తున్నారు.


విశాఖలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. తునిలో వరదల కారణంగా హైదరాబాద్ నుండి హౌరా వెళ్లాల్సిన ఆరు రైళ్లను దారి మళ్లించారు. వాటిని ఖాజీపేట, నాగపూర్ మీదుగా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. తుని రైల్వే స్టేషన్‌లో రాత్రి నుండి పలక్‌నుమా ఎక్సుప్రెస్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.