తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
posted on Oct 21, 2019 @ 6:20PM
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు నష్టం వాటిల్లుతోంది.ఎడతెరిపి లేని వర్షాలకు భాగ్యనగరం మరోసారి వణికిపోయింది. పిడుగుల ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.శీతాకాలంలో కారుమబ్బులు కమ్ముకొచ్చి కుంభవృష్టిలా వర్షాలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు ,ఈశాన్య, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తేమగాలులు వీస్తున్నాయి. ఇవి తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతంలో పరస్పరం కలుస్తున్నందున ఈశాన్య రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి.వీటి కారణంగానే కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కారుమబ్బులు ఏర్పడి కొద్ది గంటల వ్యవధిలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది.
ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ్హ హెచ్చరించింది ఉపరితల ద్రోణి రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని ఐఎండీ వివరించింది.నిన్న హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది బంజారాహిల్స్ ,జూబ్లీహిల్స్, మెహిదీపట్నం ,ఆసిఫ్ నగర్, లకిడికపూల్, అమీర్ పేట్, మాసబ్ ట్యాంక్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది, పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పలుచోట్ల నాలాలు పొంగిపొర్లాయి, రహదారులన్నీ నదులను తలపించాయి, వాహన ధరలు నరక యాతన అనుభవించారు .మొత్తానికి రోజుల తరబడి వర్షం కురవడంతో జన జీవనం అస్తవ్యస్తంగా తయారైంది.