గుప్పెడు గింజలతో బోలెడు ఆరోగ్యం

ఎర్రగా, చూడగానే నాలుగు గింజలు నోట్లో వేసుకునేలా ఊరించే దానిమ్మలో మన ఆరోగ్యానికి పనికివచ్చే ఎన్నో పోషకాలు వున్నాయి. దానిమ్మ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో తెలుసా?... నోటి పూతగా వుంటే ఒక దానిమ్మని వలచి గుప్పెడు గింజలు నోట్లో వేసుకోండి చాలు. దానిమ్మలోని యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. 


ఆడవారు నెలసరి రోజుల్లో దానిమ్మని తింటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆ సమయంలో వుండే ఇతర శారీరక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇవేకాదు.. దానిమ్మని రోజూ తినడం అలవాటుగా చేసుకుంటే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. అలాగే దీనిని సహజ యాస్పిరిన్ అనచ్చు. ఎందుకంటే రక్త సరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. రోజుకి పావు కప్పు దానిమ్మరసం చాలు గుండె భద్రంగా వుండటానికి. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలామంచిది. 

ఆస్టియో ఆర్ద్రస్టియస్‌తో బాధపడేవారు రోజూ దానిమ్మ తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది. వయసు పెరిగేకొద్దీ ఏర్పడే చర్మం ముడతలను నివారించే గుణం కలిగిన దానిమ్మ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది కూడా. దీనిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ చక్కగా ఎదగడానికి దోహదపడుతుంది. రుచిగా, చూడగానే తినాలనిపించే దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిశాక తినకుండా వుంటామా! రోజూ తప్పకుండా గుప్పెడు గింజలని నోట్లో వేసుకుందాం. ఆరోగ్యంగా వుందాం.

 
-రమ