దీపావళిలో ఎక్కువగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే..
posted on Nov 11, 2023 @ 2:21PM
దీపావళి దేశం యావత్తు సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సమయంలో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తుంటారు. ఒకప్పటికంటే ఇప్పుడు బాణసంచా కూడా అప్డేట్ అయ్యాయి. కేవలం బాణసంచా మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో స్వీట్లు, పిండివంటలు ఘుమఘుమలాడిపోతాయి. ఒకవైపు పటాసుల మోత, మరొకవైపు వంటల పరిమళాలు మనసును నిలువనీయవు. అయితే ఈ పండుగ కారణంగా బరువు పెరగడం, రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. వీటి నియంత్రణ ఎవరి చేతుల్లో వారిదే. కాబట్టి వీటి గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కానీ పటాసుల పొగ కారణంగా కళ్లు, శ్వాసక్రియ మొదలైన వాటికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంటుంది. దీపావళి సందర్భంగా కళ్ళు, శ్వాస క్రియ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుసుకుంటే..
బాణసంచా కాల్చేటప్పుడు వాటి నుండి వెలువడే స్పార్క్స్ లేదా పొగ నుండి కళ్లను రక్షించుకోవడానికి రక్షిత గాగుల్స్ ధరించడం చాలా ముఖ్యం . ఈ సాధారణ గాగుల్స్ ఎగిరే నిప్పురవ్వలు, బాణసంచా తాలుకూ అవశేషాలు, బాణసంచాలో ఉపయోగించే రసాయనాల నుండి కళ్ళను రక్షిస్తాయి. అందుకే దీపావళి సమయంలో గాగుల్స్ ధరించడం వల్ల ఇలాంటి సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.
బాణసంచా కాల్చేటప్పుడు సేప్ గా ఉండాలంటే నిర్ణీత దూరం పాటించడం అవసరం. పేలుడు సంభవించే బాణసంచా, నిప్పురవ్వలు ఎగజిమ్మే చిచ్చుబుడ్లు, కాకరవొత్తులు, పటాసులు కంటికి గాయం కలిగించే ప్రకాశవంతమైన కాంతిని, మంటలను ఎగజిమ్ముతాయి. ఇలాంటి వాటిని ఉపయోగించేటప్పుడు వాటిని దూరం నుండి వెలిగించాలి.
బాణసంచాలో గన్‌పౌడర్‌తోపాటు అనేక రకాల రసాయనాలు ఉంటాయి. వాటిని తాకిన తర్వాత పొరపాటున కూడా ఆ చేతులతో కళ్లను తాకరాదు. కళ్లకు తగిలితే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల, బాణాసంచా తాకడం లేదా కాల్చిన తర్వాత, ముఖం లేదా కళ్లను తాకడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులకు అంటిన పటాసుల తాలూకు అవశేష రసాయనాలు కంటి చికాకు కలిగించవచ్చు.
పటాసులు కాల్చేటప్పుడు కంటి సంరక్షణే కాదు ప్రాణానికి ముఖ్యమైన శ్వాసక్రియ పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పొగను వెలువరిచే బాణసంచాకు దూరంగా ఉండాలి. అలాంటివి కాలుస్తున్నప్పుడు వీలైనంత దూరం వెళ్ళాలి. పటాసులు కాల్చేటప్పుడు మరచిపోకుండా మాస్క్ పెట్టుకోవాలి. ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలు ఇదివరకే ఉన్నవారు ఇన్ హెలర్ ను వెంట ఉంచుకోవాలి. పటాసులు కాల్చేటప్పుడు పెద్ద మొత్తంలో ఒకేసారి పటాసులు పేల్చకుండా గ్యాప్ తీసుకోవాలి. పోటీ పెట్టుకుని అందరూ ఒకేసారి కాల్చడాన్ని నివారించాలి.
ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పట్లో ఏ పని చేస్తున్నా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సంబంరపడాలని అనుకునేవారు చాలా ఎక్కువ. పటాసులు కాలుస్తూ వీడియోలు, సెల్పీలు తీసుకుంటూ పటాసులను నిర్లక్ష్యం చేయకూడదు. పరిసరాల మీద స్పృహ ఉండాలి. చిన్నపిల్లలతో పటాసులు కాల్పించేటప్పుడు పెద్దలు దగ్గరే ఉండాలి.
*నిశ్శబ్ద.