అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్
posted on May 25, 2023 @ 3:23PM
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగ కుదుటపడింది. ఈ నెల 19 నుంచీ ఆమె తీవ్ర అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణను ఎదుర్కొనవలసిన అవినాష్ రెడ్డి తన తల్లి అనారోగ్యం కారణంగా హాజరు కాలేనంటూ అదే ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం (మే25) శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందంటూ విశ్వ భారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆమెకు స్టంట్ వేయాల్సి రావచ్చనీ, అది కూడా ఇప్పుడే అవసరం లేదనీ, కావాలనుకుంటే హైదరాబాద్ లో స్టంట్ వేయించుకోవచ్చనీ పేర్కొన్నారు. స్టంట్ వేసినా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చని ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పేర్కొంది.
ఇలా ఉండగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం ఆదేశాల మేరకు గురువారం (మే25)విచారించి తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కుదుటపడిందని ఆస్పత్రి హెల్త్ బులిటిన్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.