వేయించిన శనగలు తింటే ఇన్ని లాభాలు ఉంటాయని తెలుసా?
posted on Jan 18, 2025 @ 9:30AM
శనగలు భారతీయులు ఆహారంలో బాగా ఉపయోగించే పప్పు ధాన్యం. బస్సు ప్రయాణాలలో, పార్కుల దగ్గర, సినిమా సెంటర్ల దగ్గర, స్కూళ్ల దగ్గర వేయించిన శనగలు తింటూ ఎంజాయ్ చేసేవారు బోలెడు మంది ఉంటారు. ఈ వేయించిన శనగలు పది, ఇరవై ఏళ్ల కిందట మంచి టైం పాస్ చిరుతిండి. ఇప్పుడు అవే శనగలు పోషకాహార జాబితాలో ఉంది. కాల్చిన శనగలను తినడం వల్ల ఆరోగ్యం చాలా బావుంటుందని అంటున్నారు. ఇంతకీ ఈ కాల్చిన శనగలను తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుంటే..
పోషకాలు..
వేయించిన శనగలలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉంటాయి. చలికాలంలో వేయించిన శనగలు తినడం వల్ల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి.
శనగలను సాధారణ కాలంలోనే కాకుండా చలికాలంలో కూడా నిక్షేపంగా తినవచ్చు. ఎముకలు బలంగా ఉండాలంటే వేయించిన శనగలను తీసుకవడం మంచిది. శనగలలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేయించిన శనగలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్బుతంగా సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజూ వేయించిన శనగలు తింటూ ఉంటే రోగనిరోధ శక్తి కూడా బలపడుతుంది.
శరీరానికి మంచి శక్తి లభించాలంటే వేయించిన శనగలు తినడం మంచి మార్గం. సాధారణంగా పచ్చి శనగలను కూర చేసుకుంటారు. కానీ వాటిని రోజూ వండుకోలేం. అదే వేయించిన శనగలు అయితే రోజూ కొన్ని తినవచ్చు. వేయించిన శనగలలో కార్బోహేడ్రేట్లు, ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అమితమైన శక్తిని ఇస్తాయి.
వేయించిన శనగలు తింటే శక్తి లభించడం, రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా మారడం మాత్రమే కాదు.. మధుమేహ రోగులకు చాలా మంచిది. వేయించిన శనగలను స్నాక్స్ గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
బరువు తగ్గాలని అనుకునే వారు చిరుతిండిగా వేయించిన శనగలు తీసుకుంటే మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. పైగా ఇప్పట్లో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వేయించిన శనగలలో కేలరీలు చాలా తక్కువ. పైగా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.
చలికాలంలో జీర్ణసమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆహారం జీర్ణం కాకపోవడం, మలబద్దకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఒక దాని వెంట ఒకటి వస్తాయి. వీటికి చెక్ పెట్టాలంటే వేయించిన శనగలు చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే వేయించిన శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
*రూపశ్రీ.