ఈ డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తింటే చాలు.. శరీరానికి ప్రాణం పోస్తాయి..!

 


డ్రై  ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు,  ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. మాంసాహారం తినని వారికి  ప్రోటీన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వారు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కొద్దో గొప్పో ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.   కొన్ని డ్రై ప్రూట్స్ ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే పోషకాహారంతో బలహీనంగా ఉన్న శరీరానికి తిరిగి ప్రాణం పోస్తాయి.  శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.  రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అవేంటో తెలుసుకుంటే..

బాదం..

ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన చాలామంది  రాత్రి నానబెట్టిన బాదం పప్పును ప్రతి రోజూ ఉదయం తీసుకుంటూ ఉంటారు. బాదంలో విటమిన్-ఇ ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,  ఇంకా ఇందులో ప్రోటీన్, పైబర్ కూడా ఉంటాయి.  బరువును అదుపులో ఉంచుతుంది.

ఎండుద్రాక్ష..

ప్రతిరోడూ ఎండుద్రాక్ష తింటే శరీరానికి అమితమైన బలం లభిస్తుంది.  ఎండుద్రాక్షను కూడా రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.  మలబద్దకాన్ని నివారిస్తుంది.  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

వాల్ నట్స్..

వాల్ నట్స్ కండరాలను బలపరుస్తుంది.  వాల్ నట్స్ మీద సన్నని పొర ఉంటుంది.  దీన్ని తీసేసి తినాలి. అందుకే వాల్ నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే సన్నని పొర తీసేసి తినాలి. కనీసం రోజుకు ఒక వాల్ నట్ తీసుకుంటే మంచిది.

అంజీర్..

అంజీర్ చాలా శక్తి వంతమైన డ్రై ప్రూట్స్.  అంజీర్ పండ్లు తాజాగా కూడా లభ్యమవుతాయి.  కానీ తాజా పండ్ల కంటే డ్రై అంజీర్ చాలా మంచివి.  అంజీర్ పండేకొద్ది తీపిదనం పెరుగుతుంది.  డ్రై అంజీర్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి.  ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఎముకలు,  కండరాలు బలపడతాయి.  ఎముకలు, కండరాల నొప్పులు తగ్గుతాయి.

ఖర్జూరం..


ఖర్జూరం కూడా శక్తి వంతమైన డ్రై ప్రూట్.  ఖర్జూరాలు తక్షణ శక్తిని ఇస్తాయి.  వీటిని నేరుగా తీసుకోవచ్చు.  ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత తొలగించడంలో బాగా సహాయపడుతుంది.  శరీరానికి ఐరన్ ను అందించడం ద్వారా  హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది.


పై డ్రై ప్రూట్స్ ను రాత్రి నానబెట్టి  ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం లేదా.. స్నాక్స్ సమయంలో అనారోగ్యకరమైన చిరుతిండికి బదులు వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా మారుతుంది.


                                            *రూపశ్రీ.