చలికాలంలో తెల్ల నువ్వులు తింటే ఈ లాభాలు సొంతం..!
posted on Dec 4, 2024 @ 9:30AM
సీజన్ ను బట్టి శరీరానికి ఆహారం అందించాలి. అలా అందించినప్పుడే శరీరం వాతావరణానికి తగినట్టు బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చలికాలం మొదలైంది. ఈ చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలి. ఇందుకోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అదే విధంగా పోషకాలు అధికంగా ఉన్న ఆహారం కూడా తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలలో నువ్వులు ముఖ్యమైనవి. నువ్వులలో రెండు రకాలు ఉంటాయి. వాటిలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఉన్నాయి. కానీ చలికాలంలో తెల్ల నువ్వులు తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుంటే..
నువ్వులు వేడి గుణం కలిగి ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తెల్ల నువ్వులను తీసుకోవాలి. తెల్ల నువ్వులను రోజూ కనీసం ఒక స్పూన్ మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడలో ఇది సహాయపడుతుంది.
తెల్ల నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో జీర్ణక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది. ఈ జీర్ణక్రియను ఆరోగ్యంగాను, వేగంగా చేయడంలో తెల్ల నువ్వులు సహాయపడతాయి. దీని కారణంగా మలబద్దకం సమస్య కూడా దరిచేరదు.
తెల్ల నువ్వులలో లిగ్నాన్స్, ఫైటూస్టెరాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ఇది తగ్గిస్తుంది.
నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలోనూ, ఆరోగ్య సమస్యలను నివారించడంలోనూ సహాయపడతాయి.
చలికాలంలో ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కానీ తెల్ల నువ్వులు తీసుకోవడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి.
*రూపశ్రీ.