వర్షాకాలంలో తులసి ఆకులు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

 

తులసి ఒక ఆయుర్వేద మూలిక.  తులసి మొక్కను ఔషధంగానూ,  ఆధ్యాత్మికతలోనూ భాగం చేస్తారు.  ముఖ్యంగా హిందువులు తమ ఇళ్లలో తులసిని దైవంగా పూజించడం చూస్తునే ఉంటాం.  అయితే ఈ తులసి ఆరోగ్యం కోసం ఎక్కువగా వినియోగించ బడుతుంది. తులసితో చేసే వైద్యం చాలా శక్తివంతమైనది.  ఈ వర్ష కాలంలో తులసి ప్రతి ఇంటి దగ్గర ఉండాల్సిందే.. దీంతో కలిగే ప్రయోజనాలేంటంటే..

తులసిని రోజూ ఉదయాన్నే తీసుకునే వారు ఉంటారు.  తులసి ఆకులను నేరుగా నమిలి తినేవారు మాత్రమే కాకుండా వివిధ రూపాలలో కూడా తీసుకుంటారు. తులసి టీ.. తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం,  తులసి టాబ్లెట్లు వాడటం చేస్తారు.  అయితే తులసిని రోజూ తీసుకుంటే మెదడు బాగా పని చేస్తుందట. ఇది మెదడుకు పదును పెడుతుందట.

నేటి కాలంలో దంతాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. తులసి ఆకులను మిరియాలతో జోడించి పంటి కింద ఉంచుకుంటే పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

తరచుగా తల నొప్పితో బాధపడేవారు తులసి నూనెను ఒక రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి.  ఇది తలనొప్పి నుండి అద్బుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది.  అలాగే నాసికా రంధ్రాలను,  శ్వాస నాళాలను కూడా రిలాక్స్ చేస్తుంది.

జలుబు, దగ్గు కారణంగా గొంతు నొప్పిగా ఉంటుంది.  దీని వల్ల గొంతు బొంగురుపోవడం చాలా మందికి అనుభవంలోనే ఉంటుంది.  ఇలాంటి పరిస్థితిలో తులసి ఆకులను రసం తీసి తాగితే గొంతునొప్పి గొంతు బొంగురు పోవడం వంటివి తగ్గుతాయి.

తలలో పేను సమస్యలు,  తలలో చుండ్రు వంటివి ఉంటే తులసి నూనెను తలకు రాసుకోవచ్చు.  ఇది జుట్టు సంబంధ సమస్యలను చక్కగా తగ్గిస్తుంది. తలలో పేనులు చచ్చిపోతాయి.

చెవులలో నొప్పి లేదా వాపు ఉంటే ఒక చుక్క గోరువెచ్చని తులసి రసాన్ని చెవుల్లో వేయాలి.  దీని వల్ల చెవి నొప్పి సమస్యలు తగ్గుతాయి.

దగ్గు సమస్య అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో జ్యూస్ తయారు చేసి తాగాలి.  ఇది అన్ని రకాల దగ్గుల నుండి ఉపశమనం అందిస్తుంది.

సైనసైటిస్ సమస్య కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటోంది.  ఈ సమస్య ఉన్న వారు తులసి ఆకులను వాసన చూస్తుంటే సైనసైటిస్ సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.

విరేచనాల సమస్యతో ఇబ్బంది పడేవారు పది తులసి ఆకులను,   ఒక గ్రాము జీలకర్రను తీసుకోవాలి.  ఈ  రెండింటిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని తేనెతో కలిపి తినాలి.  ఇలా తింటే విరేచనాల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

ఆస్తమా సమస్య వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ.   ఆస్తమా తో ఇబ్బంది పడేవారు తులసి పొడి, మంజరి,  తేనె కలిపి తాగితే ఆస్తమా సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.

                                             *రూపశ్రీ.