చలికాలంలో కుంకుమ పువ్వు పాలు తాగితే కలిగే బెనిఫిట్స్ తెలుసా?
posted on Jan 21, 2025 @ 9:30AM
వాతావరణాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారతాయి. వేసవిలో చల్లగా ఏమైనా తాగాలని అనుకుంటాం. అదే చలికాలం వచ్చే సరికి ఆహారపు అలవాట్ల ఎంపిక నుండి ఆహారం ఉండే స్థితి వరకు అన్నీ మారతాయి. ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలు, ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాగే రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి కోవకు చెందినదే కుంకుమ పువ్వు పాలు. చలికాలంలో చాలామంది కుంకుమ పువ్వు జోడించిన పాలు తాగాలని అనుకుంటారు. కుంకుమ పువ్వు పాలు తాగితే కలిగే బెనిపిట్స్ ఏంటంటే..
కుంకుమ పువ్వు ఖరీదైన మసాలా దినుసు. అయినా సరే కొన్ని సందర్భాలలో కుంకుమ పువ్వును తప్పక వాడతారు. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే సెరోటోనిన్ హార్మోన్ పాత్ర చాలా ముఖ్యం. కుంకుమ పువ్వు సెరోటోనిన్ హార్మోన్ ను ప్రోత్సహిస్తుంది. అందుకే కుంకుమ పువ్వు పాలు తాగితే ఒత్తిడి తగ్గుతుంది. గర్భవతులు కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగాలనే నిబంధన పెట్టినది కూడా వారిలో గర్భధారణ కారణంగా ఏర్పడే ఒత్తిడి నియంత్రణలో ఉండాలనే.
కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగేటప్పుడు చాలా కొద్ది పరిమాణమే ఉపయోగిస్తారు. కేవలం కొన్ని కుంకుమ పువ్వు రేకలను ఉపయోగిస్తారు. కానీ ఇది చాలా శక్తివంతమైనది. ఇది జీర్ణశక్తిని బలపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
కుంకుమ పువ్వులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మార్చడంలో సహాయపడతాయి. రోజూ కుంకుమపువ్వు పాలు తాగుతుంటే వయసు పెరిగినా అందం తగ్గదు.
కుంకుమ పువ్వులో కాల్షియం ఉంటుంది. అలాగే పాలలో కూడా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కుంకుమ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. అలాగే కుంకుమ పువ్వులో కంటికి మేలు చేసే విటమిన్-ఎ కూడా ఉంటుంది.
మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపులో కండరాల తిమ్మిరి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నొప్పిని, తిమ్మిరిని తగ్గించడంలో కూడా కుంకుమ పువ్వు పాలు సహాయపడతాయి.
కుంకుమ పువ్వు పాలు నిద్ర బాగా పట్టడంలో సహాయపడతాయి. చలికాలంలో ప్రతిరోజూ కుంకుమ పువ్వు పాలు తాగడం వల్ల పైన చెప్పుకున్న ప్రయోజనాలు అన్నీ చేకూరతాయి.
*రూపశ్రీ.